లైట్ బాయ్‌ చెప్పినా వెళ్ళిపోతా: విశ్వక్‌ సేన్‌

November 07, 2022
img

ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ తనపై చేసిన ఆరోపణలకు విశ్వక్‌  సేన్‌ సమాధానం ఇచ్చాడు. తాను షూటింగ్‌కి రాకుండా చాలా ఇబ్బంది పెట్టానని, తనకు ‘ప్రొఫషనిలిజం’ లేదని, సినిమా ఇండస్ట్రీకి పనికిరానని అర్జున్ తనపై చేసిన విమర్శలపై విశ్వక్‌  సేన్‌ స్పందిస్తూ, “నేను కేవలం ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్ళలేదు. నాలుగు రోజులు షూటింగ్‌కి వెళ్ళిన తర్వాత ఐదో రోజునే షూటింగ్‌కి వెళ్లకపోవడం తప్పే. అయితే అర్జున్ సర్ ఆ సినిమా స్క్రిప్ట్ నాకు పంపినప్పుడే దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు అవసరమైన మాట్లాడుకొని చేసుకొందామని నాతో చెప్పారు. సెట్‌లో లైట్ బాయ్‌ సలహా చెప్పినా విని నచ్చితే అమలుచేస్తానని సర్ చెప్పారు. నేను స్క్రిప్ట్ లో కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవం. అయితే నేను పది చెపితే ఓ రెండు మాత్రమే మార్చి మిగిలినవి యధాతధంగా ఉంచి షూట్ చేస్తుండటంతో నేను హర్ట్ అయ్యాను. 

సినిమా కధ నచ్చకపోయినా చేస్తుండటం కళ్ళు మూసుకొని కాపురం చేస్తున్నట్లే అనిపించిది. అందుకే నేను ఒకే ఒక్క రోజు షూటింగ్‌ ఆపేసి స్క్రిప్ట్ గురించి మాట్లాడుకొందామని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నా మేనేజర్ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎట్టలేదు. చివరికి మధ్యాహ్నం ఫోన్‌ చేసినప్పుడు నన్ను వాళ్ళ సినిమాలో నుంచి తొలగించామని చెప్పారు. నన్ను వద్దనుకొన్న వారి గురించి మాట్లాడవలసిన అవసరం నాకేమిటి?అందుకే మౌనంగా ఉండిపోయాను. కానీ అర్జున్ సర్ నా మీద ఇన్ని ఆరోపణలు చేసినందున నేను వాటన్నిటికీ తప్పక సమాధానం చెప్పుకోవలసి వస్తోంది.

నటుడిగా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో నాకే తెలుసు. కానీ ఇండస్ట్రీలో ప్రవేశించి నిలద్రొక్కుకోవాలంటే అవన్నీ తప్పవని మౌనంగా భరించాను. ఆనాడు నన్ను అవమానించినవారితో కూడా సినిమాలు చేశాను. అది ప్రొఫెషనిలిజం కాదా?

నాతో కొంతమంది పెద్దనిర్మాతలు కూడా సినిమాలు తీశారు. చిన్న నిర్మాతలైనా, పెద్ద నిర్మాతలైన నాకు సినిమాయే ముఖ్యం. నేను ఓ సినిమా ఒప్పుకొంటే దాని పూర్తి బాధ్యతలు నా భుజంపై వేసుకొని పనిచేస్తాను. సినిమా ప్రమోషన్స్‌ కోసం రోడ్లమీద తిరిగి మరీ ప్రచారం చేసిన రోజులున్నాయి. కనుక నేను ఎటువంటి వాడినో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. నాకు ప్రొఫషనిలిజం లేదని సినిమా ఇండస్ట్రీలో లైట్ బాయ్‌ చెప్పినా నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ! నేను అర్జున్ సర్‌ని నొప్పించిన్నట్లు భావిస్తే అందుకు క్షమాపణలు కోరుతున్నాను,” అని విశ్వక్‌  సేన్‌ రాజయోగం టీజర్‌ విడుదల కార్యక్రమంలో వివరణ ఇచ్చాడు.

Related Post