విశ్వక్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు: అర్జున్

November 05, 2022
img

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత అర్జున్ ఈరోజు సాయంత్ర హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి నటుడు విశ్వక్ సేన్ తమను ఎంతగా ఇబ్బంది పెట్టాడో వివరించారు. “ఈ సినిమా కధ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉందంటూ వెంటనే సంతకం పెట్టిన విశ్వక్, ఆ తర్వాత సినిమా షూటింగ్‌లకు రాకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. మేము అన్నీ సిద్దం చేసుకొని అతని కోసం ఎదురుచూస్తుంటే ఇవాళ్ళ షూటింగ్ క్యాన్సిల్ చేయమని చిన్న మెసేజ్ పంపించేవాడు. నేను నా 40 ఏళ్ళ సినీ జీవితంలో ఎవరికీ చేయనన్ని ఫోన్లు విశ్వక్ ఒక్కడికే చేయాల్సి వచ్చింది. అయినా ఫోన్లు ఎత్తేవాడు కాదు. షూటింగ్‌లకు వచ్చేవాడు కాదు. 

ఇండస్ట్రీలో సీనియర్ నటులు జగపతిబాబుని నేను నా సినిమా కోసం కాల్షీట్స్ అడిగితే ఆయన తన షెడ్యూల్ చూపించి మద్యలో ఒక్కరోజు కూడా వాటిని మానేయలేనని,  ఒప్పుకొన్నవన్నీ పూర్తి చేసిన తర్వాత రమ్మంటే వస్తానని చెప్పారు. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కనుక నేను ఒత్తిడి చేశాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. అదీ కమిట్‌మెంట్ అంటే! 

నేను  బాలకృష్ణగారిని నా సినిమా ఓపెనింగ్‌కు రమ్మనమని ఆహ్వానించాను. ఆయన కూడా తన దర్శకుడు, నిర్మాత ఒప్పుకొంటేనే వస్తానని లేకపోతే రాలేనని చెప్పారు. చిరంజీవి, వెంకటేష్ లను కూడా అడిగితే వారు అలాగే చెప్పారు. నేను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశాను. ఆయన షూటింగ్‌కి ఒక్కరోజు కూడా ఆలస్యంగా రావడం నేను చూడలేదు. అదీ... ప్రొఫషనిలిజం అంటే! విశ్వక్‌లో వృత్తిపరమైన ఈ నిబద్దత లేనేలేదు. దర్శకుడు, నిర్మాత అంటే అసలు గౌరవమే లేదు. 

నేను అతనితో సినిమా చేసి కోట్లు సంపాదించేయాలనుకోలేదు. నా మనసుకి నచ్చిన కధను సినిమాగా తీయాలనే కోరికతోనే ఈ సినిమా మొదలుపెట్టాను. కానీ విశ్వక్ మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టాడు. సినిమా షూటింగ్‌కి అన్నీ సిద్దం చేసుకొన్నాక హీరో రానని చెపితే ఎంత నష్టం? సెట్ కోసం పనిచేసిన వారందరి శ్రమ వృద్ధాయే కదా? 

నా సినిమా నుంచి అతను బయటకు వెళ్ళిపోయాడంటే అది నా గౌరవానికి, పరపతికి జరిగిన అవమానంగానే నేను భావిస్తాను. కనుక నా సినిమాకు పనిచేసే వారందరినీ నేను చాలా బాగా చూసుకొంటాను. అయినా విశ్వక్ వెళ్ళిపోయి నన్ను చాలా అవమానించాడు. ఇక ఈ జన్మలో అతని మొహం చూడను. అతనితో సినిమాలు చేయను. ఇప్పటివరకు తీసిన రెండు షెడ్యూల్స్ పక్కన పెట్టేసి మళ్ళీ మొదటి నుంచి వేరే హీరోతో చేస్తాను. డబ్బు నష్టపోయినందుకు బాధగా లేదు కానీ ఇండస్ట్రీలో సీనియర్‌నైన నన్ను నలుగురిలో అవమానపడేలా చేసినందుకే ఎక్కువ బాధపడుతున్నాను. 

బుర్రా సాయిమాధవ్ వ్రాసిన డైలాగులు అతనికి నచ్చవు. చంద్రబోస్ వ్రాసిన పాటలకు ఆయన వంకలు పెడతాడు. చివరికి అనూప్ రూబెన్స్ సంగీతానికి వంకలు పెడతాడు. నేను అతనికి నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించాను. కానీ వినలేదు. ఒక నిర్మాతగా, దర్శకుడిగా నాకు ఏది కావాలో అదే ఆయన ఇవ్వాలి తప్ప ఇలా ప్రతీదానిలో వేలుపెట్టి నచ్చలేదని షూటింగ్‌లకు రానంటే ఎవరు మాత్రం సహించగలరు. 

విశ్వక్‌తో నేను ఎదుర్కొన్న ఈ ఇబ్బందులు ఇండస్ట్రీలో మరెవరూ ఎదుర్కొకూడదనే ఉద్దేశ్యంతోనే నేను ప్రెస్‌మీట్‌ ఇవన్నీ చెపుతున్నాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. త్వరలోనే మరో నటుడితో ఈ సినిమాను మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడతాను,” అని అర్జున్ చెప్పారు.

Related Post