వ్యక్తిత్వం వారసత్వంగా రాదు... సంపాదించుకోవలసిందే: ఎన్టీఆర్‌

November 02, 2022
img

కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు మరణోపరాంతం కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కర్ణాటక రత్న’ అవార్డుని ప్రకటించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్‌ మొదటి వర్ధంతి సందర్భంగా నిన్న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును పునీత్ భార్య అశ్వినికి అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రజనీకాంత్, జూ.ఎన్టీఆర్‌, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధామూర్తి హాజరయ్యారు. కన్నడ ప్రజలు ఎంతగానో అభిమానించే పునీత్ రాజ్‌కుమార్‌తో జూ.ఎన్టీఆర్‌కి చాలా బలమైన స్నేహం ఉంది. కనుక జూ.ఎన్టీఆర్‌ కూడా పునీత్ రాజ్‌కుమార్‌ను ‘అప్పూ’ అనే సంభోదిస్తూ కన్నడ భాషలో అనర్గళంగా ప్రసంగించడం చూసి అక్కడ పునీత్ రాజ్‌కుమార్‌ అభిమానులు, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో జూ.ఎన్టీఆర్‌ అభిమానులు సంభ్రమాశ్చర్యాలతో పొంగిపోయారు.

ఇంతకీ జూ.ఎన్టీఆర్‌ ఏం మాట్లాడటంటే, “కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటక ప్రజలందరికీ, అప్పూ అభిమానులు అందరికీ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి అతిధిగా రాలేదు. అప్పూ స్నేహితుడిగానే వచ్చాను. ఎవరైనా తమ తల్లితండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు, ఇంటి పేరు మాత్రమే పొందుతారు. కానీ వ్యక్తిత్వం వారసత్వంగా రాదు. దానిని మనమే సంపాదించుకోవాలి. పునీత్ రాజ్‌కుమార్‌ కూడా అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగినవారు.

ఓ భర్తగా, తండ్రిగా, ఓ కొడుకుగా, ఓ గొప్ప స్నేహితుడిగా, గొప్ప నటుడిగా, డ్యాన్సర్‌గా, గొప్ప గాయకుడిగా, వీటన్నిటికీ మించి గొప్ప మానవతావాదిగా ఎంతో పేరు, ఇంతగా ఆరాదించే అభిమానులను సంపాదించుకొన్నారు. నా ఉద్దేశ్యంలో కర్ణాటక రత్న అంటే పునీత్ రాజ్‌కుమారే. ఆయన వ్యక్తిత్వం గురించి మనం ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఇటువంటి మంచి స్నేహితుడిని కోల్పోయినందుకు చాలా బాధ కలిగినప్పటికీ ఆయన మన అందరి హృదయాలలో శాశ్వితంగా నిలిచే ఉంటారనే తృప్తి చాలు నాకు,” అని కన్నడ భాషలో జూ.ఎన్టీఆర్‌ అలవోకగా ప్రసంగిస్తుంటే పునీత్ రాజ్‌కుమార్‌ అభిమానులు ఆనందంతో పొంగిపోయారు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం జూ.ఎన్టీఆర్‌ జపాన్ వెళ్లినప్పుడు అక్కడ జపనీస్ భాషలో ప్రసంగం ప్రారంభించి అందరినీ ఆకట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌లాగ అనర్గళంగా అందరినీ ఆకట్టుకొనేలా మాట్లాడే ఈ నేర్పును చూసి భయపడే చంద్రబాబు నాయుడు జూ.ఎన్టీఆర్‌ని టిడిపికి దూరంగా పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. 


Related Post