టైగర్ నాగేశ్వరరావుతో రేణు దేశాయ్ రీఎంట్రీ... ఎలా ఉంటుందో?

September 30, 2022
img

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో విడిపోయినప్పటి నుంచి రేణు దేశాయ్‌కి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పటికి పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కావడంతో ఆమె సినిమాలు చేయలేదు. కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు. కనుక రేణూ దేశాయ్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 

మాస్ మహరాజ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పుడు అంటే 1970లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గజగజలాడించిన స్టువర్టు’పురానికి చెందిన గజదొంగ నిజజీవిత కధ ఆధారంగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తయారవుతోంది.  

ఈ సినిమాలో రేణూ దేశాయ్ పాత్ర కూడా నిజజీవిత పాత్రే కావడం విశేషం. కనుక దాని గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. తెలుగువారికి సుపరిచితులైన ప్రముఖ కవి, రచయిత గుర్రం ఝాషువా కుమార్తె హేమలతా లవణం. ఆమె నిజామాబాద్‌ జిల్లాలోని జోగినీ వ్యవస్థ, బాణామతి వంటి అనేక దురాచారాలను రూపుమాపడానికి చాలా కృషి చేశారు. దొంగలు, త్రాగుబోతులు, వ్యబిచారవృత్తిలో ఉన్నవారి పిల్లలను చేరదీసి నిజామాబాద్‌ జిల్లా గాంధారి గ్రామంలో చైల్డ్ ఎట్ రిస్క్ అనే పేరుతో సంస్కరణ కేంద్రాన్ని స్థాపించారు. ఒకప్పుడు దొంగలకు నిలయంగా ఉండే స్టువర్టుపురంలో పర్యటించి వారిలో పరివర్తనకు కృషి చేయడమే కాక ప్రభుత్వం, పోలీసులతో మాట్లాడి వారి పునరావాసం కూడా ఏర్పాటు చేశారు. ఆమె సమాజానికి చేసిన విశేష సేవలకుగాను అనేక అవార్డులు అందుకొన్నారు. అటువంటి మహోన్నతమైన మహిళగా రేణూ దేశాయ్ నటిస్తున్నారు. కనుక ఓ అద్భుతమైన పాత్రతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. 

మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారంటూ సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజకు జోడీగా నుపూర్ సనన్ నటించింది. ఈ సినిమాకి కెమెరా మాధే, సంగీతం జీవి రవిప్రకాష్, అందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 14వ తేదీన టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది.


Related Post