మంచు కుటుంబాన్ని వేదిస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు?

September 28, 2022
img

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు , ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత కొంతకాలంగా జూబ్లీహిల్స్‌లోని ఓ కార్యాలయంలో పనిచేస్తున్న 21 మందితో కూడిన ఓ బృందం మా మంచు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోనే నివశిస్తున్న ఓ స్టార్ హీరోయే మా కుటుంబాన్ని వేధించేందుకు వారిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశాడు. అతని ఆఫీస్ ఐపి అడ్రస్ మా దగ్గర ఉంది. ఇదే విషయం మేము సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాము,” అని అన్నాడు.  

జూబ్లీహిల్స్‌లో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌, మహేష్ బాబు, ప్రభాస్‌ వంటి పెద్ద హీరోలు  నివాసముంటున్నారు. అయితే వీరందరూ ఎల్లప్పుడూ తమ సినిమాలతో చాలా బిజీగా ఉంటారు. పైగా వీరందరూ ఇండస్ట్రీలో అందరితో చాలా హుందాగా, స్నేహపూర్వకంగా ఉంటారు. కనుక వీరెవరూ ఇటువంటి చవుకబారు పనులు చేస్తారనుకోలేము. వారికి అంత అవసరం, సమయం, ఎవరిమీద ఇంత పగా ప్రతీకారాలు కూడా లేవు. 

అయితే మంచు విష్ణు ‘ఒక నటుడు’ అని కాకుండా నిర్ధిష్టంగా ‘జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఓ స్టార్ హీరో’ అని చెపుతునందున వీరిలో ఎవరో ఒకరిని ఉద్దేశ్యించి అతను ఈ ఆరోపణలు చేస్తున్నట్లు భావించక తప్పదు. 

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్‌, మంచు విష్ణు పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు ‘ఓ స్టార్ హీరో’ అంటున్నాడు కనుక ప్రకాష్ రాజ్‌ని ఉద్దేశ్యించి ఈ ఆరోపణ చేసినట్లు భావించలేము. 

మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్‌కు ‘మెగా ఫ్యామిలీ’ మద్దతు తెలిపింది కానీ అక్కడితో వారందరూ ఎన్నికల గురించి మరిచిపోయి మళ్ళీ సినిమా హడావుడిలో పడ్డారు. కానీ ‘జూబ్లీహిల్స్‌లో నివశిస్తున్న ఓ స్టార్ హీరో’ ఒకరు తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని మంచు విష్ణు ఆరోపిస్తున్నాడు. కనుక అతను మెగా ఫ్యామిలీని ఉద్దేశ్యించే ఈ ఆరోపణ చేస్తున్నాడా?

అయినా ప్రత్యేకంగా 21 మందికి జీతం ఇచ్చి నియమించుకొని మంచు కుటుంబాన్ని వేధించవలసిన అవసరం ఎవరికుంది? అలా చేస్తే రేపు సైబర్ పోలీసులు వచ్చి ఇంటి తలుపు తట్టకుండా ఉంటారా? ఇంతకీ‘జూబ్లీహిల్స్‌లో నివశిస్తున్న ఓ స్టార్ హీరో’ ఎవరు?అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? త్వరలోనే తెలుస్తుంది.

Related Post