మహేష్-త్రివిక్రమ్ షూటింగ్ నిలిచిపోయిందట!

September 24, 2022
img

మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ మొదలై వారం రోజులవుతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా రెండూ మంచి హిట్ అవడంతో మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేస్తుండటంతో మహేష్ బాబు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. పైగా వారు అసలు ఊహించలేని స్టైల్లో మహేష్ బాబు కనిపించేసరికి వారి ఆనందానికి హద్దులే లేవు.

ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది కనుక దాని అప్‌డేట్స్ గురించి అందరూ చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వారికో చిన్న షాకింగ్ న్యూస్! 

ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఫైటింగ్ సీన్స్‌ షూటింగుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబుకి స్టంట్ మాస్టర్స్ అంబు, అన్విలతో ఏదో చిన్న గొడవ జరగడంతో షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్స్ ఇద్దరినీ మార్చాలని మహేష్ బాబు కోరినట్లు తెలుస్తోంది. 

ఒకవేళ స్టంట్ మాస్టర్స్‌కి మహేష్ బాబుకి మద్య గొడవ జరిగి ఉంటే వారిని మార్చవలసి ఉంటుంది లేదా మహేష్ బాబు, వారు రాజీపడితేనే షూటింగ్ కొనసాగుతుంది. ఒకవేళ వారిని మార్చవలసివస్తే షూటింగ్ మళ్ళీ ప్రారంభం కావడానికి ఆలస్యమవుతుంది. ఒకవేళ వారితో చేసిన స్టంట్ సీన్స్ కూడా మార్చాలంటే మళ్ళీ మొదటి నుంచి షూటింగ్ ప్రారంభించవలసి ఉంటుంది. ఏ కారణం చేత షూటింగ్ ఆలస్యమైనా నిర్మాతకు కోట్లలో నష్టం తప్పదు. 

మహేష్ బాబు సెట్స్‌లో చాలా ప్రశాంతంగా, తన పనేదో తాను అన్నట్లు చేసుకోపోతాడు తప్ప ఎవరినీ నొప్పించడనే మంచిపేరుంది. కనుక మహేష్ బాబుకి స్టంట్ మాస్టర్స్‌కి మద్య నిజంగా గొడవ జరిగిందా లేక మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తవడం వలన షూటింగ్ నిలిపివేశారా? అనేది ఇంకా తెలియవలసి ఉంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం.  

ఇది మహేష్ బాబు 28వ చిత్రం. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు కనుక అంతవరకు #MB28గానే పరిగణిస్తున్నారు. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. 

Related Post