నెట్‌ఫ్లిక్స్‌లో గాడ్ ఫాదర్?

September 19, 2022
img

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆచార్యతో తీవ్ర నిరాశ చెందిన చిరంజీవి, ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. అయితే ఇప్పటికే విడుదలైన సింగిల్స్, ఫస్ట్ లుక్, టీజర్‌ దానిలో స్టంట్స్, మ్యూజిక్ అన్నీ అంత గొప్పగా లేకపోవడంతో అభిమానులు ఆందోళనగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో ఆందోళన కలిగిస్తున్న మరో విషయం ఏమిటంటే, ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ లూసీఫర్‌లో సినిమాకు ఆయువుపట్టు వంటి టోవినో ధామస్ పాత్ర, ఓ ప్రసంగం ఉంటుంది. తెలుగులో ఆ పాత్రను, ఆ ప్రసంగాన్ని కూడా దర్శకుడు మోహన్ రాజా పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే దానికి బదులు ఎవరూ ఊహించలేని అంశం ఒకటి గాడ్ ఫాదర్‌లో జోడించినట్లు తెలుస్తోంది.    

చిరంజీవి అభిమానులకు ఓ శుభవార్త ఏమిటంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాకు భారీగా సొమ్ము చెల్లించి ఓటీటీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది. అయితే సినిమా సూపర్ హిట్ కాకపోతే ఎంత డబ్బు వచ్చినా ప్రయోజనం ఉండదు. మలయాళ సినిమాలలో తప్పనిసరిగా హీరో, హీరోయిన్లకి మూడు పాటలుండాలి… విలన్ల రెండు మూడు ఫైట్స్ ఉండాలి... అనే నియమం పాటించరు. కనుక మలయాళ సినిమాలు ఓ స్థాయిలో ఉంటాయి. అటువంటి సినిమాను తీసుకొని చిరంజీవి ఇమేజ్ కోసం మూడు పాటలు, నాలుగు ఫైట్స్ జోడిస్తే కధ చచ్చిపోతుంది. కనుక దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్‌పై అటువంటి హత్యా ప్రయత్నాలు చేయలేదని ఆశిద్దాం.     

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ పైగా హిందీలో కూడా దీనిని విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఇది హిట్ అయితే చిరంజీవి దీని తర్వాత చేయబోయే సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో తీసుకోగలుగుతారు. ఫ్లాప్ అయితే మాత్రం తెలుగు సినిమాలకే పరిమితం కావలసి వస్తుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరంజీవికి బాడీగార్డుగా అతిధిపాత్రలో నటించాడు. చిరంజీవితో ఓ డ్యాన్స్ కూడా ఉంది. ఈ సినిమాలో ఇంకా సత్యదేవ్, సునీల్, దీవి వద్యా, అతిధి పాత్రలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు.    

ఈ సినిమాకు ధమన్ సంగీతం, కెమెరా వర్క్స్ నీరావ్ షా అందిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీలను ప్రకటించనున్నారు.

Related Post