లైగర్‌ ఫెయిల్ అవడానికి రెండు కారణాలు: వర్మ

September 16, 2022
img

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్‌ సినిమా ఫ్లాప్ అవడంపై నేటికీ సినీ ఇండస్ట్రీలోవారు ఇంకా పోస్టుమార్టం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి విషయాలలో ఎప్పుడూ ముందుండే వివాదాల వర్మ కాస్త ఆలస్యంగా స్పందిస్తూ, “లైగర్ సినిమా ఫెయిల్ అవడానికి రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి ఈ సినిమాతో బాలీవుడ్‌ నిర్మాత కరణ్ జోహార్‌కు సంబందం ఉండటం. రెండు లైగర్‌ ప్రమోషన్స్‌లో స్టేజి మీద విజయ్ దేవరకొండ అతిగా దూకుడు ప్రదర్శించడం. 

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్‌లో కరణ్ జోహార్‌ సినిమాల బాయ్ కాట్ కొనసాగుతూనే ఉంది. కనుక లైగర్‌ సినిమా కూడా బాయ్‌కాట్‌కు గురై నష్టపోయింది. విజయ్ దేవరకొండ స్టేజి మీద ఎప్పుడూ కాస్త దూకుడుగానే ప్రవర్తిస్తుంటాడు. లైగర్‌ ప్రమోషన్స్‌లో కూడా అలాగే ప్రవర్తించాడు. 

అయితే అంతకు ముందు జూ.ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్ చరణ్‌ వంటి పెద్ద హీరోల సినిమా ప్రమోషన్స్‌లో వారు స్టేజి మీద ఎంతో వినయంగా వ్యవహరించడం చూసి హిందీ ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయారు. దక్షిణాది హీరోలు ఈ స్థాయికి ఎదిగినా ఇంత వినయంగా ఉంటారా?అని బాలీవుడ్‌ హీరోలతో పోల్చుకొన్నారు. అప్పుడే విజయ్ దేవరకొండ వారికి భిన్నంగా స్టేజి మీద దూకుడుగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనలో వారికి కాస్త అతిశయం కనిపించి ఉండవచ్చు. కనుక సినిమాను తిరస్కరించి ఉండవచ్చు,” అని చెప్పారు. 

వర్మ చెప్పని మరో కారణం.. లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌ చాలా అతిగా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ సినిమాలో కొత్తగా ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాను తిరస్కరించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ లైగర్‌ తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ఓ గుణపాఠం నేర్పిందని చెప్పవచ్చు. మరి దాని నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకొన్నారా లేదా? రాబోయే సినిమాల ఫలితాలలో కనిపిస్తుంది.

Related Post