రివ్యూలు బాగుంటేనే సినిమా చూస్తా: నాగార్జున

September 14, 2022
img

ఒక సినిమా తీయడం వెనుక ఎంత మంది కష్టం, కన్నీళ్ళు, వేదన ఉన్నాయో తెలియాలంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2008లో వచ్చిన నేనింతే సినిమాను తప్పక చూడాలి. అటువంటి సినిమాలను ఎంత మంది ఎన్ని రకాలుగా చంపేస్తారో కళ్ళకు కట్టినట్లు దానిలో చూపారు. 14 ఏళ్ళ క్రితం తీసిన ఆ సినిమాలో చూపిన పరిస్థితులే నేటికీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సినిమాలను చంపేసేందుకు కొత్తగా ఇంకా చాలా మంది పుట్టుకువచ్చారు. చాలా రకాలుగా చంపేస్తున్నారు. 

వాటిలో ఒకటి మూవీ రివ్యూలు కూడా. కోట్లు ఖర్చు పెట్టి నెలల తరబడి నిద్రాహారాలు లేకుండా తీసిన ఓ సినిమాను, ఎక్కడో ఏసీ గదిలో కూర్చొన్న వ్యక్తులు మూడే మూడు ముక్కలలో చిటికెలో చంపేస్తున్నారని ‘నేనింతే’ సినిమాలో నిర్మాతగా నటించిన షాయాజీ షిండే ఆవేదన వ్యక్తం చేస్తాడు. నేటికీ అదే జరుగుతోంది. 

దశాబ్దాలపాటు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న నాగార్జునవంటివారు కూడా పది రివ్యూలను చూసిన తర్వాతే సినిమా చూస్తానని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున కూడా నటించారు. ఆ చిత్రానికి కూడా రివ్యూలు బాగోలేనప్పటికీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 

ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు సినిమాలు విడుదలైన వారం రోజుల తర్వాత సినీ మ్యాగజైన్లలో వచ్చేవి. అప్పటికి ఆ సినిమాని అందరూ చూసేసేవారు. కనుక వాటిపై ఎవరికీ ఆసక్తి ఉండేది కాదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకమునుపే ట్విట్టర్‌ రివ్యూలు, ఫస్ట్-షో పూర్తయ్యేలోగానే పూర్తి రివ్యూలు వచ్చేస్తున్నాయి. కనుక నేను కూడా ఏవైనా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూడాలంటే ముందుగా రివ్యూలు, వాటి రేటింగులు చూస్తాను. కనీసం వెయ్యి రివ్యూలు, సెవెన్ స్టార్ రేటింగ్ వస్తేనే సినిమాలైన, వెబ్‌ సిరీస్‌లైనా చూస్తాను. లేకుంటే సినిమా చూడటం టైమ్ వేస్ట్ కదా?” అని అన్నారు. 

సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా, నిర్మాతగా, ఓ ప్రొడక్షన్ హౌస్ యజమానిగా ఉంటూ నాగార్జున ఈవిదంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన చెప్పినదాని ప్రకారం బ్రహ్మాస్త్రకి వచ్చిన నెగెటివ్ టాక్, నెగెటివ్ రివ్యూలు, తక్కువ రేటింగ్ చూసి ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు వెళ్లకపోయుంటే ఎవరు నష్టపోతారు?నిర్మాతే కదా?నాగార్జున వెలిబుచ్చిన అభిప్రాయాలు నిజమే కావచ్చు కానీ ఇటువంటి అభిప్రాయాలను తన మనసులోనే ఉంచుకొంటే ఇండస్ట్రీకి మేలు చేసినవారవుతారు.

Related Post