నిర్మాతల కష్టాలను నిర్మాతలే అర్ధం చేసుకోపోతే ఎలా?

August 09, 2022
img

తెలుగు సినీ పరిశ్రమలో ఆగస్ట్ 1వ తేదీ నుంచి షూటింగులు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి షూటింగులు నిలిపివేశామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. హీరోల పారితోషికం, ఇతర ఖర్చులపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సమస్యలు ఎప్పటికీ ఉండేవే కనుక వాటి కోసం షూటింగులు నిలిపివేయాలనే నిర్ణయం సరికాదని కొందరు నిర్మాతలే వాదిస్తున్నారు. అలాగే తమ సినిమాలు ఎప్పుడు థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ చేసుకోవాలనే హక్కు తమకే ఉండాలి కానీ దానిని ఎవరో నిర్ణయించడం ఏమిటని కొందరు నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. నలుగురు పెద్ద నిర్మాతలు కూర్చొని తమపై వారి అభిప్రాయాలు, నిర్ణయాలు రుద్దితే ఎలా?అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో తీసుకొంటున్న నిర్ణయాల వలన ఇండస్ట్రీకి మేలు కలుగకపోగా ఇంకా నష్టపోతుందని భావిస్తున్నాను. అయినా ఒక నిర్మాత తన డబ్బుతో ఓ సినిమా తీసుకొంటే దానిని ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో అతనే నిర్ణయించుకోవాలి కానీ ఇతరులు ఎవరో షరతులు విధించడం ఏమిటి? ఇది కరెక్ట్ కాదు. నిర్మాత సినిమాపై పెట్టిన పెట్టుబడి వెనక్కు తెచ్చుకొనే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చుకొంటాడు. అదే కదా ముఖ్యం? అలాకాక ఎవరో ఏదో చెపితే ఆ ప్రకారం సినిమాను రిలీజ్ చేసుకొని నష్టపోతే, ఆ చెప్పినవారు అతని నష్టం పూడుస్తారా? పూడ్చరు కదా?మా సినిమాలను విడుదల చేసుకొందామంటే థియేటర్లను ఇవ్వరు. పోనీ ఓటీటీలో విడుదల చేసుకొందామంటే వీల్లేదంటారు. అయితే మేము ఏం చేయాలి? చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఓ నిర్మాతగా తోటి నిర్మాతల కష్టాలు తెలిసినవాడిగా చెపుతున్నాను. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, తీసుకొంటున్న నిర్ణయాలు ఇండస్ట్రీకి ఏ మాత్రం మేలు చేయవు,” అని అన్నారు.

Related Post