అమీర్ ఖాన్ ఎవరో నాకు తెలీదు: బాలీవుడ్ నటుడు

August 08, 2022
img

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే దక్షిణాది రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో నివసించేవారికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అంత గొప్పవి. కనుక త్వరలో విడుదల కానున్న లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ ఎవరో... ఆయన సినిమా ఏమిటో తనకు తెలియదని ఓ బాలీవుడ్ నటుడు బహిరంగంగా చెప్పడం చూసి అందరూ షాక్ అయ్యారు. అతనే ఆన్నూ కపూర్. గత 40 ఏళ్ళుగా ఆయన హిందీ సినిమాలలో సహాయ నటుడిగా చేస్తున్నారు. అటువంటి వ్యక్తి అమీర్ ఖాన్ ఎవరో తెలీదంటే ఎవరైనా ఆశ్చర్యపోకమానరు. 

ఆయన నటించిన హిందీ వెబ్‌ సిరీస్‌ ‘క్రాష్ కోర్స్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌మీట్‌లో ఓ విలేఖరి, ‘అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగినప్పుడు, అన్నూ కపూర్ సమాధానం చెపుతూ, “ఆ సినిమా గురించి నాకేమీ తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? నేను సినిమాలలో నటిస్తుంటాను కానీ ఎన్నడూ సినిమాలు చూడను,” అని జవాబు చెప్పారు.

అపుడు ఆయన మేనేజర్ సర్దిచెపుతూ ‘నో కామెంట్స్’ అన్ని చెప్పబోతే అన్నూ కపూర్ “ఇది నో కామెంట్స్ అని సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. నేను నా చిత్రాలతో సహా ఎవరు నటించిన చిత్రాలను అసలు చూడను. నిజం చెప్పాలంటే మీరు అడుగుతున్న నటుడు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు తెలియని వ్యక్తి గురించి... అతని సినిమా గురించి ఇక నేను ఏమి చెప్పగలను?” అని అన్నారు. 

అమీర్ ఖాన్‌ గురించి అంత సీనియర్ నటుడు ఆవిదంగా ఎందుకు అన్నారో తెలీదు గానీ అప్పుడే సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైపోయింది. అయితే సినిమాలే చూడనని చెపుతున్న వ్యక్తి సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న కామెంట్స్ ని పట్టించుకొంటారనుకోలేము. ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్‌లో ఓ సీనియర్ నటుడు మరో ప్రముఖ నటుడి గురించి ఈవిదంగా మాట్లాడటం కలకలం సృష్టిస్తోంది.      

Related Post