సమంతను నేను ఎప్పటికీ గౌరవిస్తాను: నాగ చైతన్య

August 06, 2022
img

నాగ చైతన్య, సమంత విడిపోయి ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నప్పటికీ, మీడియా మాత్రం వారిని విడిచిపెట్టడం లేదు. వారు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తప్పక అడిగే ప్రశ్న వారి విడాకులు, వైవాహిక జీవితం గురించే. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్య బోడిపాలెం బాలరాజుగా ఓ సైనికుడి పాత్రలో నటించినందున ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే యధాప్రకారం ఆ సినిమాకు సంబందించి ప్రశ్నలతో పాటు వారి విడాకులు, వైవాహిక జీవితం గురించి కూడా ఓ ప్రశ్న ఎదురవుతుండటంతో నాగ చైతన్య తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 

తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మళ్ళీ అదే ప్రశ్న ఎదురైనప్పుడు, నాగ చైతన్య కాస్త అసహనంగా, “మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయి ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నాము. మేము విడిపోయిన తరువాత నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఎవరూ వాటి గురించి మాట్లాడకుండా మా విడాకుల గురించే ఇంకా మాట్లాడుకొంటున్నారు. ఈ ప్రశ్నకు జవాబులు చెప్పి చెప్పి నేను విసుగెత్తిపోయాను. అయిన్నప్పటికీ మరోసారి చెపుతున్నాను. 

మేమిద్దరం విడిపోయినప్పటికీ పరస్పరం గౌరవించుకొంటాము. నేను ఎప్పటికీ సమంతను గౌరవిస్తూనే ఉంటాను. ఆమె నటించిన సినిమాలను కూడా చూస్తుంటాను. మళ్ళీ ప్రేమలో పడతానా లేదా...? అంటే తప్పకుండా పడతాను. మనిషి జీవించడానికి శ్వాస తీసుకోవడం ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే అవసరమని నేను భావిస్తాను. మనం ప్రేమించాలి. ప్రేమింపబడాలి. అప్పుడే ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉండగలుగుతాము,” అని నాగ చైతన్య అన్నారు.      

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత మాత్రం తాను మళ్ళీ ప్రేమలో పడదలచుకోలేదని స్పష్టంగా చెప్పడం విశేషం. సినిమాలలో అద్భుతమైన ప్రేమికులుగా నటిస్తూ నిజజీవితంలో వారు ప్రేమలో విఫలమవడం, ఆ విషయం నలుగురికి తెలిసేవరకు ఇరువురూ నిజజీవితంలో కూడా ప్రేమికులుగా నటించడం విశేషమే కదా?

Related Post