కార్తికేయ-2 మరో రోజు వాయిదా.. మంచిదే: నిఖిల్

August 03, 2022
img

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినప్పటికీ వివిద కారణాలతో అనేకసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్ట్ 12వ తేదీన విడుదల కావలసి ఉండగా మరోసారి వాయిదా పడింది. అయితే ఈసారి ఒక్కరోజుకే వాయిదా పడింది. కార్తికేయ-2 ఆగస్ట్ 13వ తేదీన విడుదలకాబోతోంది. ఆగస్ట్ 12న మరో అగ్రహీరో నటించిన సినిమా విడుదలవుతుండటంతో దాని కోసం కార్తికేయ-2 వాయిదా పడినట్లు నిఖిల్ మాటలను బట్టి తెలుస్తోంది. 

ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో నిఖిల్ విలేఖరులతో చిట్ చాట్ చేస్తూ, “అన్ని సినిమాలు ఆడాలి. చిత్ర పరిశ్రమ బాగుండాలనే సదుద్దేశ్యంతోనే నా సినిమాను ఆగస్ట్ 13కి వాయిదా వేసుకొన్నాను. సినిమాల మద్య క్లాష్ రాకూడదని అనుకొన్నాం. క్లాష్ వద్దనుకొన్న ప్రతీసారి నా సినిమానే వెనక్కు జరుపుకోవలసి వస్తోంది. కార్తికేయ-2 విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ జీవితంలో కొన్నిసార్లు అడ్జస్ట్ మెంట్స్ తప్పవు. 

అయితే నా సినిమా వాయిదా పడితే హిట్ అవుతుందనే సెంటిమెంట్ అర్జున్‌ సురవరంతో మీరే నాకు కల్పించారు. కనుక అదే సెంటిమెంట్‌ ఈ సినిమాకు వర్తిస్తుందేమో చూద్దాం. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ-2 దానికి కొనసాగింపు కాదు కానీ అదే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుంది కనుక రెండు సినిమాలతో సులువుగానే కనెక్ట్ కావచ్చు.  ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా అనడం కంటే మల్టీ లాంగ్వేజ్ ఫిలిమ్ అనడమే సరైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఒక మంచి అడ్వంచర్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా అన్ని భాషల ప్రజలు చూస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే తీశాము,” అని నిఖిల్ అన్నాడు. 

 కార్తికేయ-2 లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, సత్యా, వైవా హర్ష తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

                 


Related Post