గందరగోళంలో తెలుగు సినీ పరిశ్రమ

August 01, 2022
img

తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ గందరగోళం, సంక్షోభం తలెత్తింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి అన్ని సినిమా షూటింగులు నిలిపివేయాలని ఫిలిమ్ ఛాంబర్ నిర్ణయించగా, అనేక మంది నిర్మాతలు ఆ నిర్ణయాని వ్యతిరేకించడమే కాకుండా నేడు యధాప్రకారం షూటింగులు కొనసాగించారు. వంశీ పైడిపల్లి-విజయ్ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ విశాఖలో జరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి ధనుష్ చిత్రం ‘సార్’ షూటింగ్ యధాప్రకారం జరిగింది. 

ఈ గందరగోళంపై తెలుగు ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో అందరూ కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమా షూటిగులు నిలిపివేయాలని నిర్ణయించాము. ఫిలిమ్ ఫెడరేషన్‌తో సహా అందరికీ లేఖల ద్వారా ఈ విషయం తెలియజేశాము కూడా. కనుక మన సమస్యలను పరిష్కరించుకొనేందుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము,” అని అన్నారు. 

సీనియర్ నటుడు సుమన్ సినిమా షూటింగులు నిలిపివేయడంపై స్పందిస్తూ, “హీరోల పారితోషికం తగ్గించుకోమని లేకుంటే షూటింగులు బంద్ చేస్తామని బెదిరించడం సరికాదు. నటీనటులకు డిమాండ్ ఉన్నంతకాలమే పారితోషికం ఇస్తారు. కనుక హీరోలతో మాట్లాడుకొని పనిగంటలు పెంచుకొని తక్కువ సమయంలో సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే అవసరమైనప్పుడే కాల్ షీట్స్ తీసుకొని ఖర్చు తగ్గించుకోవచ్చు. నిర్మాతలు హీరోలకు డబ్బు ఇస్తున్నారు కనుక సమయానికి షూటింగులకి హాజరుకావలని గట్టిగా చెప్పడంలో తప్పు లేదు. సినిమా షూటింగులు నిలిపివేస్తే సమస్యలు పరిష్కారం కావు ఇంకా పెరుగుతాయి. షూటింగులు నిలిపివేస్తే నిర్మాతలే నష్టపోతారు తప్ప ఓటీటీలు కాదు. కనుక షూటింగులు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది,” అని అన్నారు.

Related Post