గత జన్మలో తెలంగాణలో పుట్టానేమో?

June 14, 2022
img

దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం ఈ నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి, తన కెరీర్‌ గురించి చాలా విషయాలు చెప్పింది.  

సుమారు 30 సంవత్సరాల  క్రితం వరంగల్‌ సమీపంలో సరళ అనే యువతి ఓ మావోయిస్టుతో ప్రేమలో పడుతుంది. ఆ యధార్ధ ఘటనల ఆధారంగానే దర్శకుడు వేణు ఊడుగుల ఈ విరాటపర్వం కధ వ్రాసుకొన్నారు. 

ఆనాటి యధార్ధ ఘటనలు, తెలంగాణలో నాటి పరిస్థితుల గురించి వేణు నాకు చాలా వివరంగా చెప్పడంతో సరళ పాత్రను నేను అర్ధం చేసుకొని ఆ పాత్రలో పూర్తిగా లీనం కాగలిగాను. అప్పుడే నాకు ఓ విషయం అర్ధమైంది. తరచూ ఒకే రకమైన ఎన్ని సినిమాలు చేసినా వాటిలో కొత్తదనం ఏమీ ఉండదని, కొత్తగా నేర్చుకొనేందుకు ఏమీ ఉండదని గ్రహించాను. ఇటువంటి కధలు, చిత్రాలే నటిగా మరింత రాటు తేలేందుకు ఉపయోగపడతాయని గ్రహించాను. 

ఏ సినిమాలో అయినా దర్శకుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఆవిదంగా నటిస్తుంటాము. కానీ స్క్రిప్ట్ విషయంలో కూడా నేను రానా నుంచి మరో కొత్త విషయం నేర్చుకొన్నాను. స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం గొప్పే కానీ అంతకంటే మరికాస్త మరి కాస్త ఎక్కువగా ప్రయత్నించి స్క్రిప్ట్ లో ఉన్నదానికంటే గొప్పగా రానా చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇకపై నేనూ మరింత మెరుగుగా నటించే ప్రయత్నం చేస్తాను. 

ఒక ఆర్టిస్ట్ ప్రతీ సినిమాకి ఒత్తిడి, బాధ భరించడం కూడా చాలా అవసరమని విరాట పర్వంలో నేర్చుకొన్నాను. ఆ బాధ, ఒత్తిడిలో నుంచే మనలోని ఆర్టిస్ట్ బయటకి వస్తాడని గ్రహించాను. కనుక డబ్బు, హిట్స్ కంటే నటిగా సంతృప్తి కలిగించే పాత్రలు చేయాలని ఉంది. 

నామీద దర్శక నిర్మాతలు నమ్మకం పెట్టుకొని ఓ సినిమాలోకి తీసుకొన్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత నాపైనే ఉంటుంది. అలాగే ఓ సినిమా చేస్తున్నప్పుడు దానిని మనం ఎంతగా నమ్ముతామో, ప్రేమిస్తామో అదే విషయాన్ని ప్రేక్షకులకు కూడా తెలియజెప్పి వారిని థియేటర్లకు రప్పించాల్సిన బాధ్యత కూడా నాపై ఉందని నేను నమ్ముతాను. అయినా నా సినిమాని నేను ప్రమోట్ చేసుకోకపోతే మరెవరూ చేస్తారు?

ఇప్పటివరకు నాకు వచ్చిన సినిమాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్నవే. ప్రతీ సినిమాలో నేను తెలంగాణ అమ్మాయిగానే చేస్తున్నాను. గత జన్మలో నేను తెలంగాణలో పుట్టానేమో?” అంది సాయిపల్లవి.       


Related Post