కమర్షియల్ సినిమాలో అలాంటి డైలాగ్స్ తప్పవు మరి

May 11, 2022
img

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా చేసిన సర్కారువారి పాట సినిమా రేపే విడుదల కాబోతోంది.  ఈ సందర్భంగా మహేష్ బాబు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెపుతున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌లో మహేష్ బాబు అసభ్యకరమైన డైలాగ్స్ చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాటిపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “సినిమాలో ఆ పాత్ర నడవడికను బట్టి డైలాగ్స్ ఉంటాయి. పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి డైలాగ్స్ చెప్పడానికి వెనకాడను. నేను ఒకసారి సినిమా ఒప్పుకొన్నాక స్క్రిప్ట్ కి పూర్తిగా కట్టుబడి నటిస్తాను తప్ప మరో ఆలోచన చేయను,” అని మహేష్ బాబు చెప్పారు. 

ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన పాత్ర గురించి అడిగిన మరో ప్రశ్నకు, “ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఎటువంటి హద్దులు లేకుండా చాలా స్వేచ్ఛగా చేస్తున్న భావన నాలో కలిగింది. అందుకే ప్రతీ నిమిషం, ప్రతీ సన్నివేశం నేను చాలా ఆస్వాదిస్తూ చేశాను. ఈ పాత్ర తీరు, దానికి నా డైలాగ్స్, హావభావాలు చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. అందుకే ఇది నాకు పోకిరీ సినిమాను గుర్తుకు తెచ్చిందని చెప్పాను,” అని అన్నారు. 

కమర్షియల్ సినిమాల ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు సినిమా బడ్జెట్‌లు భారీగా పెరిగిపోయాయి. కనుక పెద్దగా ప్రయోగాలు చేయలేము. కనుక ఇటువంటి కమర్షియల్ సినిమాలు తప్పనిసరి. అది కమర్షియల్ అయినా మరొకటైనా...థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు నూటికి నూరు శాతం సంతృప్తిపడేలా సినిమా తీయడమే ముఖ్యమని నేను భావిస్తున్నాను,” అని చెప్పారు.  

సూపర్ స్టార్ కృష్ణ జీవిత కధ ఆధారంగా బయోపిక్ తీసేందుకు తనను ఎవరూ సంప్రదించలేదని, అయినా అటువంటి సాహసం చేయబోనని మహేష్ బాబు చెప్పారు. 

Related Post