క్రాక్ : రివ్యూ

January 11, 2021
img

మాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా క్రాక్. ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ వీరశంకర్ పోతురాజు (రవితేజ) తనున్న ఏరియాలో ఏ తప్పు జరిగినా తప్పు చేసిన వారి అంతు చూస్తాడు. పోతురాజుకి బ్యాక్ గ్రౌండ్ అనే మాట నచ్చదు. అది ఎవరైనా వాడితో మాత్రం ఇక అవతల ఎంతటి వాడైనా పోతురాజుకి బలవ్వాల్సిందే. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీన్ ను పట్టుకుంటాడు పోతురాజు.. అందుకే అతన్ని కడపకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత రాజమండ్రి జైల్లో ఉన్న కటారి శ్రీను మీద టార్గెట్ షిఫ్ట్ చేస్తాడు. ఒంగోలు కింగ్ మేకర్ కటారి శ్రీను ఎందుకు జైలుకి వెళ్తాడు. అతనికి, వీరశంకర్ పోతురాజుకి మధ్య ఏం జరిగింది అన్నది క్రాక్ కథ.

విశ్లేషణ :

రవితేజ ఫ్యాన్స్ ఎన్నాళ్లనుండో కోరుకునే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా క్రాక్ వచ్చింది. గోపీచంద్ మార్క్ మాస్ అండ్ కమర్షియల్ కథను అదే విధంగా తెరకెక్కించాడు. జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకుండాల్సిన కాయ, గోడకుండాల్సిన మేకు ఇలా రోడ్డు ఎందుకున్నాయి.. ఈ మూడిటితో ముగ్గురు తోపుల్ని తాట తీశాయ్.. కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురిని ఆడుకుంది ఒకే పోలీసోడు అని దాదాపు కథ చెప్పేశాడు గోపీచంద్.

సినిమా కథని ఇంట్రెస్టింగ్ గా మలచే క్రమంలో మొదలు పెట్టి మొదటి భాగం రొటీన్ గా సాగించగా.. ఇంటర్వల్ కు ముందు మళ్లీ ఆడియెన్స్ ను అలర్ట్ అయ్యేలా చేశాడు. ఇక అదే ఫాం తో సెకండ్ హాఫ్ కూడా పక్కా కమర్షియల్ సినిమా మీటర్ లో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ పాతదే అయినా కథనం అది కూడా రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంతో క్రాక్ కిక్ ఇచ్చింది.

రవితేజ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సగటు ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైనింగ్ అంశాలు ఉన్నాయి. తమిళ సినిమా సేతుపతికి దగ్గరగా ఉన్న ఈ సినిమా సంక్రాంతి సినిమా పండుగ షురూ చేసింది. 

నటన, సాంకేతిక వర్గం :

రవితేజ ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా అనిపించాడు. సినిమా అంతా సూపర్ జోష్ తో నటించారు. రవితేజ లుక్, స్టైల్, మాస్ యాక్షన్ ఇవన్ని ఆయన ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ లా అనిపిస్తాయి. శృతి హాసన్ ఓకే అనేలా ఉంది. కటారి శ్రీను పాత్రలో సముద్ర ఖని నటన ఇంప్రెస్ చేసింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. జికె విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ లో కెమెరా మెన్ పనితనం అదరగొడుతుంది. థమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. సాంగ్స్ ఓకే అనేలా ఉండగా తన మార్క్ బి.జి.ఎం తో మెప్పించాడు థమన్. ఇక డైరక్టర్ గోపీచంద్ మలినేని తన బలాన్ని చూపించారు. యాక్షన్ ఎంటర్టైనర్ లను తన మార్క్ స్టైల్ ను యాడ్ చేస్తూ డైరక్టర్ గా గోపీచంద్ ది బెస్ట్ అనిపించుకున్నారు. అయితే కొన్ని చోట్ల సినిమా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

రవితేజ క్రాక్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫీస్ట్ లాంటి సినిమా.

రేటింగ్ : 2.75/5

Related Post