రాజాసాబ్ టీజర్ 16న.. ఫాన్స్ వెయింటింగ్ ఇక్కడ!

June 13, 2025


img

మారుతి స్థాయి దర్శకుడితో పాన్‌ ఇండియా స్థాయి హీరో ప్రభాస్‌ సినిమా చేయడమే చాలా విశేషం. అయితే దర్శకుడు మారుతి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరో లేదో డిసెంబర్‌ 5న ‘రాజాసాబ్’ వస్తే కానీ తెలీదు. ఆలోగా చిన్న శాంపిల్ అన్నట్లు ఈ నెల 16న ఉదయం 10.52 గంటలకు టీజర్‌ వదులుతున్నారు. 

ఆ తర్వాత మీడియా మిత్రులందరినీ అజీజ్ నగర్‌లో రాజాసాబ్ కోసం వేసిన సెట్స్‌కి తీసుకువెళ్ళి చూపించబోతున్నారట. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ ఐమాక్స్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ‘రాజాసాబ్’ గురించి విశేషాలు వివరిస్తారు. ‘రాజాసాబ్’ని 5 భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు కనుక జాతీయ మీడియాని కూడా 16న జరుగబోయే ఈ ప్రెస్‌మీట్‌కి ఆహ్వానించినట్లు తాజా సమాచారం. కనుక మారుతి శాంపిల్ కాస్త గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్లు అర్దమవుతోంది. 

ఈ సినిమాలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నమ్మినవారి చేతిలో మోసపోయి హత్య చేయబడిన ‘రాజాసాబ్’గా ఓ పాత్ర, ఆయన మనుమడిగా మరో పాత్ర చేస్తున్నారు. 

పెద్ద రాజాసాబ్ ఆత్మ పాడుబడిన ప్యాలస్‌లో ఉండిపోతే దానిలోకి చిన్న రాజాసాబ్ ప్రవేశించడంతో అసలు కధ మొదలవుతుందని తెలుస్తోంది. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, జారీనా వాహేబ్, సంజయ్ దత్, రిద్ధి కుమార్‌, మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, యోగి బాబు, వరలక్ష్మి శరత్ కుమార్‌, జిషు సేన్‌ గుప్తా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార స్పెషల్ సాంగ్‌కు డాన్స్ చేయబోతున్నారు.   

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  



Related Post

సినిమా స‌మీక్ష