దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘లైగర్’ దెబ్బ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. దాని తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ తీస్తే అది బోర్లా పడింది. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో పూరీ జగన్నాధ్ మరో సినిమా మొదలు పెట్టడానికి మళ్ళీ చాలా సమయం తీసుకున్నారు.
ఈసారి కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ‘టబు’ని కూడా తీసుకున్నట్లు ప్రకటించారు. టబు చివరిగా నటించిన తెలుగు సినిమా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠ పురములో.’ కనుక ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విజయ్ సేతుపతి, టబు ఇద్దరూ మంచి నటులే కానీ గ్లామర్, కమర్షియల్ సినిమాలకు సూట్ అవరు. కనుక దర్శకుడు పూరీ జగన్నాధ్ వారితో ఏదో బలమైన కధతోనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లు భావించవచ్చు.
పూరీ, ఛార్మీల సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’ ఈ సినిమాని 5 భాషలలొ పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని పూరీ చెప్పారు. ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు.