రాచకొండ పోలీస్ కమీషనర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మంచు కుటుంబంలో గొడవలు చల్లారిన్నట్లు అనిపిస్తున్నా ఇంకా లోలోన సెగలు రగులుతూనే ఉన్నాయి. ‘జగన్నాధ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మంచు మనోజ్ మళ్ళీ అన్న మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబుని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, నన్ను తొక్కేయాలని ఎవరు ఎంత ప్రయత్నించినా ధైర్యంగా ఎదుర్కొని పోరాడుతూనే ఉన్నాను. నన్ను ఆ నాలుగు గోడల మద్యకు రానీయకపోయినా మీ గుండెల్లో నుంచి నన్ను తొలగించలేరు. మీరందరే (అభిమానులు) నా కుటుంబ సభ్యులు. మీరే నా దేవుళ్ళు. మీరు నన్ను ఆదరిస్తున్నంత కాలం నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. చెట్టు పేరు, జాతిపెరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను పండో కాయనో కాదు. మీ మనోజ్‌ని. నేను మీ వాడిని...” అన్నారు.
ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కీచులాడుకోవడం సర్వసాధారణమే. మంచు మనోజ్ కూడా తండ్రి ఆస్తిలో వాటా కొరకే గొడవపడుతున్నాడు. దానిలో న్యాయంగా తనకు ఇవ్వాల్సిన వాటాని కూడా అన్న విష్ణు కొట్టేస్తున్నాడని, తండ్రి కూడా తనని కాదని మంచు విష్ణునే చేరదీసి, అతని పనికిమాలిన సినిమాలకు కోట్లాది రూపాయలు తగలేస్తున్నారని మంచు మనోజ్ బాధ పడుతున్నారు.
అయితే ఆ ఆస్తులన్నీ తండ్రి కష్టార్జితమని మంచు మనోజ్‌కి తెలుసు తన ప్రవర్తన ఆయనకు నచ్చకపోవడం వలననే తనను కాదనుకుంటున్నారని, ఆస్తిలో వాటా ఇవ్వడం లేడని కూడా తెలుసు.
తాను చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదని మనోజ్ చెప్పుకుంటున్నప్పుడు, తండ్రిలాగే కష్టపడి పనిచేస్తూ, తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే గౌరవంగా ఉంటుంది కదా?