చందు-చైతు మరో సినిమా: ఈసారి తెనాలి!

February 12, 2025


img

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్యకి దర్శకుడు చందు మొండేటి తండేల్‌తో సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అవడంతో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ సంతోషం కలిగిందని నాగ చైతన్య స్వయంగా చెప్పుకున్నారు. ఈ సినిమా సక్సస్ మీట్‌లో దర్శకుడు చందు మొండేటి అభిమానులకు ఓ శుభవార్త, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళకు ఓ చిన్న సలహా చెప్పాడు. 

ఇంతకీ ఆ శుభవార్త ఏమిటంటే, త్వరలో నాగ చైతన్యతో మరో సినిమా చేయబోతున్నాడు. అదీ ఆషామాషీ సినిమా కాదు. నాగ చైతన్య తాతగారు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ని ఇప్పటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా రీమేక్ చేస్తామని చెప్పారు. ఈ సినిమాలో నాగ చైతన్య తెనాలి రామకృష్ణ పాత్ర చేయబోతున్నారు. 

ఇక శోభిత ధూళిపాళకి ఏం సలహా చెప్పాడంటే, “ఇది ఓ చారిత్రిక సినిమా కనుక నాగ చైతన్య తెలుగు భాషపై మరింత పట్టు సాధించాలి. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతారు కనుక మీ తెలుగుని మీ భర్తకి బదిలీ చేయండి,” అని సూచించారు. అంటే నాగ చైతన్యకు మరింత బాగా తెలుగు మాట్లాడటం నేర్పించమని చందు మొండేటి సూచిస్తున్నారన్న మాట! 

తెలుగు ప్రేక్షకులు జానపద, చారిత్రిక, పౌరాణిక సినిమాలు చాలానే చూశారు. నేటికీ ఆదిపురుష్, కన్నప్ప వంటి పౌరాణిక సినిమాలు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు చారిత్రిక సినిమాలు కూడా వస్తున్నాయి.

కానీ 1956లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యి ఎవ్వర్‌ గ్రీన్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ‘తెనాలి రామకృష్ణ’ని రీమేక్ చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ ‘ఆదిత్య 369’లో ఓ చిన్న సన్నివేశంలో ‘తెనాలి రామకృష్ణ’ని చూపారు. మళ్ళీ ఆ తర్వాత ఎవరూ ఈ సబ్జక్ట్ టచ్ చేయలేదు.

కనుక తెనాలి రామకృష్ణని మోడ్రన్‌గా తీయాలనే చందు మొండేటి ఆలోచన చాలా వినూత్నంగానే ఉంది. సరిగ్గా తీసి హిట్ కొట్టగలిగితే తెలుగు సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ మొదలవుతుంది కూడా.


Related Post

సినిమా స‌మీక్ష