గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ అందించినందున, గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ, “మీఅందరి తిట్లు భరించలేక గౌతమ్‌ని చాలా హింసించి సినిమా టైటిల్ ఖరారు చేశాము. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాము,” అని ట్వీట్ చేశారు. ఆ రోజు వచ్చేసింది.
రేపు (ఫిబ్రవరి 12)న ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్ కూడా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఇంకా విశేషంఏమిటంటే, వీటిని జూ.ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రణధీర్ కపూర్ ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటిస్తోంది. రుక్మిణీ వసంత్ కీలకపాత్ర చేస్తోంది. కౌశిక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల అవినాష్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌లోనే ప్రకటించారు.