మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం: వెంకటేష్

February 11, 2025


img

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయ్యింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి నేటికీ ఇంకా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో ఆడుతోంది. 

హనుమాన్, పుష్ప-2 తర్వాత అంతగా ప్రేక్షకులను అలరించిన సినిమా ఇదే. ఈ సినిమా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ ఇద్దరినీ ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేసింది కూడా. కనుక అందరూ కలిసి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా విజయోత్సవం చాలా సంతోషంగా నిర్వహించుకున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, వెంకటేష్ ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించారు. 

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, “ఈ సినిమాని ప్రజలు ఇంతగా ఆదరించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా సినిమాని సూపర్ హిట్ చేసిన ప్రజలకు కేవలం ధన్యవాదాలు చెపితే సరిపోదు. కనుక ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్‌తో వారిని మరింత ఆనందింపజేసి రుణం తీర్చుకుంటాం. సంక్రాంతికి వస్తున్నాం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే రెండో భాగం కధ మొదలవుతుంది. సీక్వెల్‌ రాజమండ్రిలోనే మొదలుపెడతాం,” అని అన్నారు. 

సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అవడంతో దాని కోసం ఓటీటీ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులు జీ5ఛానల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14కి సినిమా విడుదలై నెలరోజులు పూర్తవుతుంది. కనుక నేడో రేపో ఓటీటీలోకి వచ్చేస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే, జీ5లోకి రాబోతోందని ఆ సంస్థ ప్రకటించింది కానీ ఎప్పటినుంచనే విషయం బయటపెట్టలేదు. 

ఈ సినిమా థియేటర్లలో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో ఆడుతోంది కనుక ఈ నెలాఖరు వరకు ఆగాలని నిర్మాతలు జీ5ని కోరిన్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే జీ5 డేట్ ప్రకటించలేదని సమాచారం. 


Related Post

సినిమా స‌మీక్ష