కన్నప్ప నుంచి మొదటి పాట ఫిబ్రవరి 10న

February 09, 2025


img

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కన్నప్ప సినిమా నుంచి మొదటి పాట సోమవారం విడుదల కాబోతోంది. శివశివ శంకర అంటూ సాగే ఆ పాట ప్రమోని విడుదల చేశారు. శివలింగం చుట్టూ కన్నప్ప ఆనందంతో డాన్స్ చేస్తున్నట్లు దానిలో చూపారు.

మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రకటించగానే అందరూ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్పని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా అంత కంటే గొప్పగా ఉంటుందని, ఉండాలని ఆశిస్తున్నారు. ఓ సినిమాని ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సినిమాతో ఈవిదంగా పోల్చి చూస్తే చాలా ఇబ్బందికరంగా మారవచ్చు. కానీ భక్త కన్నప్ప కంటే కన్నప్ప గొప్పగా ఉంటే మాత్రం ప్రేక్షకులు మంచు విష్ణుని నెత్తిన పెట్టుకుంటారు.

మరి కన్నప్ప ఏవిదంగా ఉంటుందో ఏప్రిల్ 25న విడుదలైనప్పుడు తెలుస్తుంది. ఆలోగా టీజర్‌, ట్రైలర్‌, పాటలతో కొంత స్పష్టత రావచ్చు.  

 హిందీలో ‘మహా భారత్’ సీరియల్ అద్భుతంగా తీసి మెప్పించిన బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్‌ సింగ్‌ కన్నప్పకి దర్శకత్వం చేస్తున్నారు. ఈ బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ మంచు విష్ణుకి జోడీగా నటిస్తోంది. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా నటిస్తున్నారు. ప్రభాస్‌ రుద్రుడుగా నటిస్తున్నారు. 

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష