నా అరెస్ట్‌ గురించి మీడియాకి ఇంత ఆసక్తి దేనికీ?

February 07, 2025


img

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కి ఓ కేసులో పంజాబ్‌లోని లుధియానా కోర్టు సాక్షిగా విచారణకు కావాలని పలుమార్లు నోటీసులు పంపింది. కానీ ఆయన వెళ్ళకుండా తన న్యాయవాదులని పంపిస్తుండటంతో కోర్టు ఆయన పేరిట నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. 

దీనిని హైలైట్ చేస్తూ మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో సోనూసూద్‌ అరెస్ట్‌ అంటూ పుకార్లు వ్యాపించాయి. 

వీటిపై ఆయన స్పందిస్తూ, “ఓ కేసులో కోర్టు నాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేస్తే దాని గురించి మీడియా ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోంది? నేను సెలబ్రెటీ అయినందునే కదా? ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇటువంటి పుకార్లు పుట్టించడం సబబు కాదు. 

ఈ కేసుతో నాకు ఎటువంటి సంబందమూ లేదు.. అని మా న్యాయవాదుల ద్వారా కోర్టుకి తెలియజేశాను. అయినా విచారణకు హాజరయ్యి ఇదే విషయం మరోసారి కోర్టుకి తెలియజేస్తాను. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో ఉంది గనుక ఇంతకి మించి ఇప్పుడేమీ మాట్లాడలేను. 

ఫిబ్రవరి 10న విచారణ ముగిసిన తర్వాత ఈ కేసు గురించి నేనే స్వయంగా మీడియా మిత్రులు అందరికీ వివరిస్తాను. కనుక అంతవరకు సంయమనం పాటించాలని,” సోనూసూద్ విజ్ఞప్తి చేశారు. 

లుధియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే న్యాయవాది ఈ కేసు వేశారు. మోహిత్ శర్మ అనే వ్యక్తి తనని రూ.10 లక్షలు మోసం చేశాడని, దీనికి సాక్ష్యం సోనూ సూద్ అని దానిలో పేర్కొన్నారు. 

ఆ కేసులో సోనూసూద్ సాక్ష్యం కీలకం కానీ ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో  లుధియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. 

దేశంలో వేలాదిమందికి వందల కోట్ల సాయం చేసిన సోనూసూద్‌ తప్పు చేస్తారని అనుకోలేము. పది లక్షలు చెల్లించి               ఈ కేసు నుంచి బయటపడటం ఆయనకు పెద్ద సమస్యే కాదు. కానీ ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి?అని ఆయన అనుకోవడం వల్లనే కధ ఇంతవరకు వచ్చింది. ఫిబ్రవరి 10న విచారణ పూర్తయ్యి, ఈ కేసు నుంచి సోనూసూద్ తప్పక బయటపడతారని ఆశిద్దాం.  


Related Post

సినిమా స‌మీక్ష