గేమ్ చేంజ్ అంటే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి కాదు. అల్లు అర్జున్ కేసు గురించి.
నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి సంతకం చేయాలని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
కానీ నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూ, వాటి కోసం విదేశాలకు వెళ్ళి వస్తుండే అల్లు అర్జున్‌కి ఈ రెండు ఆంక్షలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని, కనుక వాటిని సడలించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్ వేయగా దానిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
కానీ పోలీసులు ఎప్పుడు పిలిచినా అల్లు అర్జున్ తప్పనిసరిగా విచారణకు హాజరయ్యి సహకరించాలని సూచించింది. అందుకు ఆయన తరపు న్యాయవాదులు అంగీకారం తెలుపడంతో ఈ రెండు షరతులను ఉప సంహరించుకున్నట్లు నాంపల్లి కోర్టు నేడు ప్రకటించింది. కనుక అల్లు అర్జున్ ఇక నుంచి మళ్ళీ ఎప్పటిలాగే తన సినిమాలు చేసుకోవచ్చు. ఈ కేసు, కోర్టు విచారణ సంగతి ఆయన న్యాయవాదులు చూసుకోగలరు.
పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అల్లు అర్జున్ తదుపరి సినిమా అంతకు మించే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది. కానీ అది ఇంకా ఎప్పుడు మొదలుపెడతారో?