అమెజాన్ ప్రైమ్‌లోకి ఒకేసారి రెండు కొత్త తెలుగు సినిమాలు వచ్చాయి. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా ‘బచ్చలమల్లి’ చేయగా, సిద్ధార్ధ్, ఆషికా రంగనాధ్ జంటగా చేసిన ‘మిస్ యూ’ సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్నాయి.
బచ్చలమల్లి సినిమాలో అల్లరి నరేష్ మహా మూర్ఖుడుగా నటించారు. అటువంటి వ్యక్తి ప్రేమలో పడి ఏవిదంగా పరివర్తన చెందుతాడనేది కధాంశంగా తీసుకొని సినిమాని తెరకెక్కించారు. సినిమాలో బచ్చలమల్లిగా అల్లరి నరేష్ నటనకు నూటికి నూరు మార్కులు పడినప్పటికీ, దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కించడంలో తడబడటంతో మిశ్రమ స్పందన వచ్చింది.
ఎన్. రాజశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్ధ్, ఆషికా రంగనాధ్ చేసిన ‘మిస్ యూ’ సినిమాని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయగా దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. సినీ దర్శకుడు కావాలని తపించే హీరో, ఓ ప్రమాదంలో రెండేళ్ళ జ్ఞాపకాలను మరిచిపోతాడు.
ఆ తర్వాత బెంగళూరులో ఓ కేఫేలో హీరోయిన్‌ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. ఆమె ఫోటో చూసిన అతని తల్లితండ్రులు కూడా ఈ పెళ్ళి జరగదని చెపుతారు. తర్వాత ఏం జరిగిందనేది అమెజాన్ ప్రైమ్‌లో ‘మిస్ యూ’ చూసి తెలుసుకుంటే బాగుంటుంది.