గేమ్ చేంజర్‌ నానా హైరానా పడుతున్నాడా?

January 10, 2025


img

భారీ అంచనాల మద్య రామ్ చరణ్‌-శంకర్ కాంబో ‘గేమ్ చేంజర్‌’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినీ విశ్లేషకులు గేమ్ చేంజర్‌కి యావరేజ్ మార్కులు వేసి రివ్యూలు ఇచ్చేశారు. 

ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా నానా హైరానా పాట రిలీజ్ చేయగా దానికి మంచి ఆదరణ లభించింది. కానీ ఈరోజు విడుదలైన సినిమాలో ఆ పాట కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం చెందారు. 

దీనిపై గేమ్ చేంజర్‌ చిత్ర బృందం స్పందిస్తూ, “కొన్ని సాంకేతిక సమస్యల వలన అందరూ ఎంతో ఇష్టపడిన నానా హైరానా పాటని సినిమా నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ సమస్యని పరిష్కరించేందుకు మేమందరం రేయింబవళ్ళు చాలా కష్టపడుతున్నాం. జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున ఆ పాట కూడా సినిమాలోకి వస్తుంది,” అని ట్వీట్ చేసింది.        

ఇది సాంకేతిక సమస్య అని చిత్ర బృందం చెప్పుకొంటున్నప్పటికీ, కలెక్షన్స్‌ పెంచుకునేందుకు ప్రయోగిస్తున్న కొత్త టెక్నిక్ అని కూడా అనుమానించాల్సి ఉంటుంది. 

సినిమాలో ఓ పాట ఉండదని దర్శక నిర్మాతలకు ముందే తెలిసి ఉన్నప్పుడు, సినిమా విడుదలకు ముందే ఈ విషయం ప్రకటించి ఉండాలి. ఆ పాట లేకపోయినా సినిమా చూడాలనుకున్నవారే థియేటర్లకు వెళ్ళాలని సూచించవచ్చు. లేదా సినిమాలో ఓ పాట పెట్టనందుకు ఆ మేరకు టికెట్ ఛార్జీలను తగ్గించుకుంటున్నామని ప్రకటించి ఉండవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైన తర్వాత చల్లగా ఈ విషయం ప్రకటించడం ప్రేక్షకులను మోసాగించడమే కదా? 

గేమ్ చేంజర్‌ సినిమాలో ఈ పాట ఉంటుందని చెప్పే సినిమా విడుదల చేశారు. మొదటి రోజున టికెట్ ఛార్జీలు పెంచుకున్నారు కూడా. మరో పది రోజులు పెంచిన టికెట్ ఛార్జీలే వసూలు చేసుకోబోతున్నారు. కనుక ప్రేక్షకుల నుంచి డబ్బు తీసుకొని ఓ పాట వేయకపోవడం ‘సేవా లోపం’గానే పరిగణించి ఎవరైనా వినియోగదారుల కోర్టులో కేసు వేస్తే, అప్పుడు చిత్ర నిర్మాతలే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కదా? 


Related Post

సినిమా స‌మీక్ష