నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం అనంతపురంలో జరుగాల్సి ఉండగా దానిని రద్దు చేసిన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.
ఆ ఘటనపై చిత్ర బృందమంతా చాలా బాధ పడుతోందని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుణ్య క్షేత్రంలో ఈ విషాద ఘటన జరగడం చాలా బాధాకరమని పేర్కొంది.
ఇటువంటి విషాద సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సబబు కాదు కనుక రద్దు చేసుకుంటున్నామని పేర్కొంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వలన అభిమానులను నిరాశ పరిచినందుకు చింతిస్తున్నామని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.
డాకూ మహరాజ్ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేశారు. బాబీ డియోల్, సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్: వి వెంకట్ చేశారు.
ఈ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు.