పుష్ప-2 సినిమా కలెక్షన్స్ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నప్పటికీ ఒక విమర్శ సర్వత్రా వినిపిస్తూనే ఉంది. పుష్ప-1తో పోలిస్తే పుష్ప-2లో కధేమీ లేదని, అల్లు అర్జున్ ఎలివేషన్స్, నటన, ఫైట్స్, స్క్రీన్ ప్లేతోనే సినిమాని నడిపించేశారని విమర్శలు వస్తున్నాయి. అలాగే పుష్ప-1కి భిన్నంగా పుష్ప-2లో ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా అంతా అల్లు అర్జునే అన్నట్లు చుట్టబెట్టేశారనే మరో విమర్శ కూడా వినిపిస్తోంది. పుష్ప-1తో పోలిస్తే పుష్ప-2 తెలిపోయిందని, అల్లు అర్జున్ కాపాడకపోయి ఉంటే బోర్లా పడి ఉండేదని ఆక్షేపణలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అనసూయ వీటిపై స్పందిస్తూ, “ఈ సినిమా మొదటి భాగానికి సీక్వెల్. కనుక డానికి కొనసాగింపుగానే చూడాలి తప్ప దాంతో పోల్చి చూడటం ఏం సబబు?” అని ప్రశ్నించారు.
“అయితే సినిమా టికెట్స్ భారీగా పెంచేసి ఇలా సర్దుకుపోమని చెప్పడం సబబా?అంత ధర పెట్టి టికెట్స్ కొనుక్కొని సినిమా చూసేవారికి సంతృప్తి కలిగించకపోతే ఆడగకూడదా? ప్రేక్షకులని సంతృప్తి పరచలేనప్పుడు ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఏం ప్రయోజనం?” అంటూ నెటిజన్స్ ఎదురు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. వాటికి పుష్ప-2 దర్శక నిర్మాతలే సమాధానం చెప్పాలి.. అనసూయ లేదా మరొకరో కాదు.
Just IMO.. sequel ante oka katha ki continuity ani kada ardham.. mari a part to ee part ni compare cheyatam yenta varaku sababu antaru 🧐🤔 oka flow lo kada chudali tarvata en jarigindi ani.. 🧐
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 6, 2024