సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. కనుక జోరుగా సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బిహార్, తమిళనాడు, కేరళలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్స్‌కు అభిమానులు బ్రహ్మరధం పట్టారు.
కేరళలో అభిమానులైతే అల్లు అర్జున్‌ని అభిమానంగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటున్నారంటే ఆయనకు కేరళలో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్దం చేసుకోవచ్చు.
పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 3.18 గంటలు. పుష్ప-1 రన్ టైమ్ 3 గంటలున్నా ప్రేక్షకులకు ఎక్కడా విసుగెత్తించకుండా సీట్లలో నుంచి కదలకుండా కూర్చోబెట్టి వినోదింపజేశారు దర్శకుడు సుకుమార్. పుష్ప-2 అంతకు మించే ఉంటుందని చెపుతున్నారు కనుక మరో 18 నిమిషాలు అభిమానులకు ‘బోనస్’ అనే చెప్పవచ్చు.
పాట్నాలో సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఏకంగా 2 లక్షలకు పైగా అభిమానులు తరళిరాగా, ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటలలోనే ఏకంగా 40 లక్షల మంది చూసి ఆనందించారు. కనుక పుష్ప-1 రికార్డులతో సహా అన్ని సినిమాల రికార్డులను పుష్ప-2 బద్దలు కొట్టబోతోంది.
పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.