దీపావళికి విడుదలైన ‘క’ సినిమా హిట్ అవడంతో హైదరాబాద్‌లో సక్సస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “నటీనటులను వారి మార్కెట్‌ని చూసి అంచనా వేయొద్దు. వారి సినిమాలు చూసి వారి సత్తా తెలుసుకుంటే మంచిది. దీపావళికి పెద్ద సినిమాలున్నప్పుడు వీడి చిన్న సినిమా అవసరమా?ఎవరు చూస్తారు? అనే మాటలు నన్ను చాలా బాధించాయి. దాంతో అంతవరకు సినిమాపై ఎంతో నమ్మకం ఉన్న నాకు కూడా నెగెటివ్ థాట్స్ మొదలయ్యాయి.
ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉందని చెపితే నామాటలను నమ్మని వారు 99 మంది ఉంటే నమ్మినవారు ఒక్కరే ఉంటారు. అయినా నిరుత్సాహపడకుండా సినిమాని రిలీజ్ చేశాము. నేను అనుకున్నట్లే సినిమా హిట్ అయ్యింది. అలాగని ఈ విజయంతో నేనేమీ పెద్ద స్టార్ అయిపోయానని అనుకోవడం లేదు.
కానీ నా గురించి, నా సినిమా గురించి ఇంత చులకనగా మాట్లాడిన వారందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ శుక్రవారం ఫుట్ పాత్ మీదున్న నటుడు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాతో స్టార్ అయిపోగలదు. స్టార్ హీరో అనుకున్నవాడు ఫుట్ పాత్ మీదకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు.
రెండు శుక్రవారాలు సినీ పరిశ్రమలో ఎవరి జాతకాలనైనా మార్చేయగలవు. కనుక ఈవిషయం గుర్తుంచుకొని అందరం కలిసి పనిచేసుకుంటూ మంచి సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పిద్దాము,” అని అన్నారు.
కిరణ్ అబ్బవరం ఎవరిని ఉద్దేశ్యించి ఈ మాటలు అన్నారో కానీ ఆ హీరోతో చాలా చేదు అనుభవమే ఎదుర్కొన్నట్లు అర్దమవుతోంది.