రాజమౌళి-మహేష్ బాబు సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. కనుక ఈ సినిమా కధకి తగిన లొకేషన్స్ కోసం రాజమౌళి స్వయంగా కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కులో తిరుగుతున్నారు. ఈ సినిమాలో చాలా జంతువులు ఉంటాయని రాజమౌళి స్వయంగా చెప్పారు. కనుక సింహాలు, పులులు, వివిద అడవి జంతువులు స్వేచ్ఛగా తిరిగే ఈ మైదాన ప్రాంతంలో రాజమౌళి తగిన లొకేషన్స్ కోసం తిరుగుతున్నారు. ఆయన అక్కడ తిరుగుతున్నప్పుడు తీసిన ఓ ఫోటో, చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా విరివిగా వాడబోతున్నారు. కనుక సినిమాలో భారతీయ నటీనటులతో పాటు పలువురు విదేశీ నటులు కూడా నటించబోతున్నారు. ఏఐ టెక్నాలజీ ని ఉపయోగించుకునే ముందు దాని గురించి అవగాహన చేసుకునేందుకు రాజమౌళి శిక్షణ తీసుకోవడం ఆయన తెర వెనుక ఎంతగా కృషి చేస్తారో అర్దం చేసుకోవచ్చు.
భారత్‌లో తొలిసారిగా రూ.1,000 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తీయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె నారాయణ నిర్మిస్తున్నారు. మరికొన్ని జాతీయ, అంతర్జాతీయ సినీ నిర్మాణ సంస్థలు ఆయనతో కలిసే అవకాశం ఉంది.