మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాల విడుదలై ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. కానీ హిట్లు, ఫ్లాపులతో సంబందం లేదన్నట్లు రవితేజ వరుసపెట్టి సినిమాలు చేసుకుపోతూనే ఉంటారు కనుక ‘మిస్టర్ బచ్చన్’ విడుదలయ్యేలోగానే మరో కొత్త సినిమా భోగవరపు భాను దర్శకత్వంలో మొదలుపెట్టేశారు. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకి ‘మాస్ జాతర’ అని పేరు ఖరారు చేసిన్నట్లు తాజా సమాచారం.
తెలంగాణ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో రవితేజ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: నవీన్ నూలి చేయబోతున్నారు.
శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ గాయపడటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. కనుక వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది.