ముంబై డాన్సర్ మీద అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకి ఎంపికైనా సంగతి తెలిసిందే. ఆ అవార్డు అందుకోవడానికి ఆయనకి రాష్ట్ర హైకోర్టు నేటి నుంచి మూడు రోజులు మద్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగబోయే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు జానీ మాస్టర్ నేడు ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్దమవుతుంటే, జాతీయ అవార్డుల కమిటీ ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ కేసు నేపధ్యంలో ఆయనకు పంపిన ఆహ్వానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జానీ మాస్టర్ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు కనుక ఆయన బెయిల్ కూడా రద్దు అవుతుంది. జానీ మాస్టర్ బృందంలో పనిచేస్తున్న ముంబైకి చెందిన ఓ సహాయ నృత్య దర్శకురాలు నార్సింగ్ పోలీసులకు ఆయనపై ఫిర్యాదు చేసింది.
జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, సెట్స్‌లో ఉన్నప్పుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, న్యాయస్థానం రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నారు.