దూకుడుగా వెళ్ళి ఆగిపోయా: శ్రీను వైట్ల

October 02, 2024


img

దర్శకుడు శ్రీను వైట్ల ఒకప్పుడు వరుసపెట్టి హిట్స్ ఇస్తుండేవారు. అయితే చాలా కాలంగా ఆయన నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. ఆయన సినిమా చేసి దాదాపు 5 ఏళ్ళు పైనే అవుతోంది. ఇప్పుడు తనలాగే ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపీ చంద్‌తో విశ్వం సినిమా చేస్తున్నారు.

కనుక ఈ సినిమా వారిద్దరికీ అగ్నిపరీక్ష వంటిదే. విశ్వం హిట్ అయితే ఇద్దరూ ఒడ్డున పడతారు కానీ ఫ్లాప్ అయితే ఇద్దరి కెరీర్‌లో ఇదో పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఈ నెల 11వ తేదీన విశ్వం సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీను వైట్ల మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

ఆయన తాజా ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్‌లో ఎదురుదెబ్బల గురించి మాట్లాడుతూ, దూకుడు సినిమా సూపర్ హిట్ అవడంతో ఇక తిరుగులేదనుకొని ఆగడు సినిమా చేశాను. అయితే నేను వ్రాసుకొన్న అసలు కధ ప్రకారం సినిమా చేయాలంటే చాలా భారీ బడ్జెట్‌ అవుతుందని కధలో చాలా మార్పులు చేర్పులు చేసి తీశాను. అయితే అదే సినిమాకి శాపంగా మారింది. ఆగడు సినిమాతో నా కెరీర్‌కి నేనే ఫుల్ స్టాప్ పెట్టుకొన్నట్లయింది. కానీ దాని నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. 

ఇప్పుడు విశ్వం సినిమాలో గోపీ చంద్ యాక్షన్, నా మార్క్ కామెడీ కలిపి తీశాము. ఇది తప్పకుండా హిట్ అవుతుందని మేము నమ్ముతున్నాము. అందరూ అనుకొంటున్నట్లు నాకు వాస్తు పట్టింపులు లేవు. అలాగే నేను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం లేదు. నా దగ్గర వేలకోట్లు లేవు. నా ప్రపంచం సినిమా ప్రపంచం. అదొక్కటే నా సర్వస్వం,” అని శ్రీనువైట్ల అన్నారు. 

విశ్వంలో గోపీ చంద్‌కి జోడీగా కావ్య థాపర్ చేయగా, నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ, ముకేష్ రిషి, జీషు సేన్‌ గుప్తా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.    

ఈ సినిమాకి కధ: గోపీ మోహన్, భాను- నాయుడు, ప్రవీణ్ వర్మ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్, స్టంట్స్‌: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నే చేశారు.  

దోనెపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ , వేణుస్వామి దోనెపూడి కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష