ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ అవార్డ్ ప్రకటించింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరుగనున్న జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో మిధున్ చక్రవర్తి ఈ అవార్డు అందుకోనున్నారు. ఆయన ఇదే ఏడాదిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ అవార్డ్ కూడా అందుకోబోతున్నారు.
పశ్చిమ బెంగాల్ నుంచి అనేకమంది దర్శకులు, నటీనటులు బాలీవుడ్‌లో ప్రవేశించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అనేక అవార్డులు అందుకున్నారు. మిధున్ చక్రవర్తి కూడా బెంగాలీలు గర్వపడేవిదంగా ఎదిగారు. ఆయన 1976లో ‘మృగయ’ సినిమాతో బాలీవుడ్‌లో ప్రవేశించి ఇంతవరకు తెలుగు (గోపాల గోపాల)తో సహా హిందీ, కన్నడ, ఒడియా, భోజ్‌పురి భాషల్లో 370కి పైగా సినిమాలలో నటించారు. నేటికీ తన వయసుకి తగ్గ పాత్రలు లభిస్తే చేస్తూనే ఉన్నారు. 80వ దశకంలో డిస్కో డ్యాన్స్ నేపధ్యంలో చేసిన సినిమాలు ఆయన సినీ జీవితంలో మైలురాళ్ళుగా నిలిచిపోతాయి.
మిథున్ చక్రవర్తి రాజకీయాలలో కూడా ప్రవేశించి తన సత్తా చాటుకున్నారు. మొదట పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. మూడేళ్ళ క్రితం అంటే 2021లో బీజేపీలో చేరి దానిలో కొనసాగుతున్నారు.
కనుక ఆయన తాను బీజేపీలో ఉన్నందునే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆయన ఖండించారు. తాను దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఉన్నందునే ఈ అవార్డు లభించింది తప్ప రాజకీయాల వల్ల కాదని మిధున్ చక్రవర్తి చెప్పారు.