మా అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మద్య తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చిన్న ట్వీట్ యుద్ధం జరిగింది. దానిపై మంచు విష్ణు స్పందిస్తూ, “ప్రకాష్ రాజ్ అంటే నాకు చాలా గౌరవం.
ఆయన మా నాన్నగారితో కలిసి చాలా సినిమాలలో నటించారు. ఓ తిరుపతివాసిగా, శ్రీవారి భక్తుడిగా నేను నా అభిప్రాయం చెప్పాను. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. అంతే! ఇందులో ఎటువంటి వివాదం లేదు.
ఈ అంశంపై టాలీవుడ్‌కి చెందినవారు ఎవరూ ఎందుకు మాట్లాడలేదంటే, మేమందరం అద్దాల మేడలో నివసిస్తున్నటువారిమి కనుక. పొరపాటున తప్పుగా మాట్లాడితే అందరికీ మేము టార్గెట్ అవుతాము. కనుక సామాన్య ప్రజాల్లాగ మాట్లాడేందుకు మాకు స్వేచ్చ ఉండదు. కనుక మేము మౌనంగా ఉండిపోతాము. అలాగని మా అభిప్రాయాలూ మాకు ఉంటాయి. అవి సమాజానికి తెలియజేయవలసిన అవసరం లేదు,” అని అన్నారు.
మంచు విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబుతో కలిసి అమరావతికి వెళ్ళి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రూ.25 లక్షల చెక్కు అందజేశారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. శివపార్వతులుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.