మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయడంలో పేరొందిన మాడమ్ టుస్సాడ్స్ సంస్థ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని తయారుచేసి సింగపూర్‌లోని తమ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతోంది.
ఇది చాలా అరుదైన గౌరవంగా సినీ నటులు భావిస్తుంటారు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడు రామ్ చరణ్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు.
దానికోసం రామ్ చరణ్ కొలతలు ఇచ్చి, ఫోటో షూట్‌లో పాల్గొన్నారు కూడా. మరో విశేషమేమిటంటే, రామ్ చరణ్ దంపతుల పెంపుడు కుక్క రైమీని చేతిలో పట్టుకొన్నట్లుగా ఈ మైనపు విగ్రహాన్ని రూపొందించబోతున్నారు. మాడమ్ టుస్సాట్స్‌లో తన మైనపు విగ్రహాన్ని పెట్టబోతునందుకు చాలా సంతోషం కలిగిందని రామ్ చరణ్ అన్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ ఛేంజర్ పూర్తిచేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన విడుదల కాబోతోంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే ఈ సినిమాలో రెండో పాట ప్రమో శనివారం విడుదలైంది. రేపు సోమవారం పూర్తి పాట విడుదల కాబోతోంది. రామ్ చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.