జూ.ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన దేవర సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండటంతో విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో టికెట్ బుకింగ్స్ అయ్యాయి.
మొదటి రోజున దేశవ్యాప్తంగా రూ.77 కోట్లు కలెక్షన్స్ కాగా దానిలో రూ.68 కోట్లు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలోనే వచ్చిన్నట్లు తెలుస్తోంది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు కలెక్షన్స్ సాధించి దేవరకి తిరుగులేదనిపించుకున్నాడు.
ఆచార్య దెబ్బతో భయపడిన అభిమానులు దేవర సినిమా, కలెక్షన్స్ చూసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. బతుకమ్మ, దసరా పండగలతో పండుగ సీజన్ మొదలవుతుంది. కనుక తొలి పదిరోజులలోనే కలెక్షన్స్ బహుశః ఈ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంటుంది.
అసలు పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు, పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఉండాల్సిన ఉత్సాహం,సంతోషం కంటే టెన్షన్ ఎందుకు ఏర్పడుతోంది? కలెక్షన్స్ గురించి ఎందుకు చర్చించాల్సివస్తోంది? అంటే భారీ బడ్జెట్, స్టార్ ఇమేజ్, సినిమా హిట్ అవకపోతే సోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో కనిపించే పైశాచిక ఆనందం వగైరాలన్నీ కారణంగా భావించవచ్చు. కనుక పెద్ద సినిమా విడుదలైన ప్రతీసారి టెన్షన్ తప్పడం లేదు.
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.