దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు ఓ అరుదైన పరిణామం జరిగింది. బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కధ ఆధారంగా తీసిన ‘12th ఫెయిల్’ అనే సినిమాని నేడు సుప్రీంకోర్టు ప్రధాన హాలులో ప్రదర్శించారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభ్యర్ధన మేరకు ఈ సినిమాని ప్రదర్శించగా ఆయనతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 600 మంది ఈ సినిమాని చూసి ఆనందించారు.
ఒక మద్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు మొదట తప్పుడు మార్గాలలో ప్రయాణించి కొందరి ప్రభావంతో తనని తాను చక్కదిద్దుకొని జీవితంలో ఏవిదంగా విజయం సాధించాదనేది ఈ సినిమా కధ. ఎంతో స్పూర్తిదాయకమైన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్‌లో విడుదల సూపర్ హిట్ అయ్యింది. కేవలం రూ.20 కోట్లతో ఈ సినిమా తీస్తే రూ.63 కోట్లు పైనే కలక్షన్స్ సాధించింది.
ఇంత స్పూర్తిదాయకమైన సినిమా తీసినందుకు జస్టిస్ చంద్రచూడ్‌తో సహా న్యాయమూర్తులు దర్శకుడు విధూ వినోద్ చోప్రాని అభినందించారు. సుప్రీంకోర్టులో తమ సినిమా ప్రదర్శిచబడటం, దానిని వారితో కలిసి చూడటం తనకు గొప్ప అవార్డు వంటిదే అని చోప్రా అన్నారు.