గేమ్ ఛేంజర్‌ నుంచి రా మచ్చ మచ్చా... పాట త్వరలో

September 25, 2024


img

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా సిద్దం అవుతున్న గేమ్ ఛేంజర్‌ సినిమాకి సంబందించి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ ఈరోజు ఉదయం ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ‘రా మచ్చ మచ్చా...’ అంటూ సాగే రెండో పాటని త్వరలో విడుదల చేయబోతున్నట్లు ట్వీట్‌ చేసింది.

ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుండటమే కాక ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇవ్వనందుకు రామ్ చరణ్‌ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన భారతీయుడు-2 బోర్లా పడటంతో అభిమానులు ఇంకా ఆందోళన చెందుతున్నారు. కనుక ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు.  

గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. రామ్ చరణ్‌ చేస్తున్న మరో పాత్రకు భార్యగా అంజలి నటిస్తోంది. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి గేమ్ ఛేంజర్‌ సినిమా నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 20వ తేదీన విడుదల కాబోతోంది. 



Related Post

సినిమా స‌మీక్ష