కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దేవర సినిమా మరో మూడు రోజులలో విడుదల కాబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. అయితే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవర సినిమా గురించి, తన కెరీర్‌లో ఎదురుదెబ్బ తగిలిన ఆచార్య సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో చిరంజీవితో దూరం పెరిగిందనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అటువంటిదేమీ లేదు. ఆ సినిమా పోయిందని గ్రహించగానే చిరంజీవే శివా నువ్వు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ రావాలంటూ నాకు ఓ మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత వెంటనే జూ.ఎన్టీఆర్‌ని హీరోగా అనుకోని దేవర కధ వ్రాసుకున్నాను.
జూ.ఎన్టీఆర్‌కి ఈ కధ చెప్పడానికే 4 గంటలు పట్టింది. అంతా విని ‘లెట్ అజ్ ప్రొసీడ్ అఫిడవిట్ దిస్ స్టోరీ’ అనే చెప్పేశారు. ఆ కధని యధాతధంగా సినిమాగా తీస్తే ఆరు గంటలు పైనే పడుతుంది. తగ్గితే కధ దెబ్బ తింటుంది. కనుక రెండు భాగాలుగా తీదామని చెప్పగానే జూ.ఎన్టీఆర్, నిర్మాతలు అంగీకరించారు. కనుక దేవర-2 మాత్రమే ఉంటుంది తప్ప దేవర-3,4 వంటివి ఉండవు, అని కొరటాల శివ చెప్పారు.
జాన్వీ కపూర్ గురించి వివరిస్తూ, “ఆ అమ్మాయికి ఇదే తొలి తెలుగు సినిమా. తన పాత్ర, సన్నివేశం, డైలాగ్స్ వగైరా అన్నిటి గురించి ముందే పూర్తి అవగాహన చేసుకొని మరీ సెట్స్‌లో అడుగుపెడుతుంది. అయినా భయంతోనే సెట్స్‌లో అడుగు పెడుతుంది. కానీ యాక్షన్ చెప్పగానే ఇక చెలరేగిపోతుంది. చాలా అవలీలగా, అద్భుతంగా నటించింది. ఆ అమ్మాయి టాలంట్ చూసి నేను, జూ.ఎన్టీఆర్ ఇద్దరం షాక్ అయ్యాము. సినిమా పూర్తయ్యేవరకు ఆమెలో ఇంకా బాగా చేయాలని తపన, సెట్స్‌లో క్రమశిక్షణ ఆమెలో మంచి లక్షణాలు. బాలీవుడ్ నుంచి వచ్చిన అమాయిలా మాకు అనిపించనే లేదంటే అర్దం చేసుకోవచ్చు,” అని కొరటాల శివ జాన్వీ కపూర్‌పై ప్రశంశలు కురిపించారు.