కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దేవర మొదటి భాగం ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వారు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ‘దేవర’ విశేషాలు చెపుతున్నారు.
జూ.ఎన్టీఆర్ సినిమా కధ, కధాంశాన్ని క్లుప్తంగా చెప్పేశారు. “ఇది 1980-90లలో జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కించాము. సాధారణంగా ప్రతీ సినిమాలో హీరో ధైర్యాన్ని హైలైట్ చేస్తారు. కానీ దేవరలో ధైర్యంతో ఇష్టం వచ్చిన్నట్లు వ్యవహరిస్తున్నవారికి హీరో అంటే నేనే... భయం రుచి చూపిస్తాను.
ఈ సినిమాపూర్తిగా యాక్షన్ డ్రామా. కనుక యాక్షన్ సీన్స్ తీసేందుకు మేమందరం చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా సెట్లో ఓ భారీ చెరువు ఏర్పాటు చేసి దానిలో నీటి కింద చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. మొదటి 15 నిమిషాలలోనే ప్రేక్షకులు సినిమాలో లీనం అయిపోతారని చెప్పగలను. అంత గ్రిప్పింగ్‌గా సాగుతుంది స్టోరీ, సన్నివేశాలు.
సైఫ్ ఆలీఖాన్ మాత్రమే చేయగల పాత్ర ‘భైర’. ఆయన టాలెంట్ ఇంతవరకు ఎవరూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపం చూడవచ్చు. జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆమె తెలుగులో చాలా చక్కగా డైలాగ్స్ చెప్పారు. ఆమె జ్ఞాపకశక్తి కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు కనుక నాకు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. చాలా సినిమాలలో భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా, హీరోని ధైర్యానికి ప్రతీకగా చూస్తుంటాము. కానీ దేవరలో హీరో భయానికి ప్రతీకగా నిలుస్తాడు. హీరోని చూస్తే భయం పుడుతుందన్న మాట. ఈ పాత్రని జూ.ఎన్టీఆర్ చాలా అద్భుతంగా చేశారు,” అని అన్నారు.