మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో మొదట హీరోయిన్‌ నేనే కానీ...

September 13, 2024


img

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్‌ ఆ తర్వాత తెలుగులో పెద్ద హీరోలతో చాలా సినిమాలే చేశారు. కానీ ఎప్పటిలాగే కొత్తనీరు వస్తే పాతనీరు కొట్టుకుపోయిన్నట్లు, కొత్త హీరోయిన్లు రాగానే ఆమె రేసులో వెనకబడిపోయారు. కానీ బాలీవుడ్‌లో వరుసపెట్టి అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే బిజినెస్‌లో కూడా దూసుకుపోతున్నారు. 

ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. టాలీవుడ్‌లో తను అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, ప్రభాస్‌తో మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో నటించే అవకాశం లభించిందని, నాలుగు రోజులు ఆ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నానని చెప్పారు. ఆ తర్వాత తాను చిన్న పనిమీద ఢిల్లీకి వెళ్ళానని, అప్పుడే ఆ సినిమా నుంచి తనని తొలగించిన్నట్లు తెలిసిందని రకుల్ చెప్పారు. 

అయితే ఆ విషయం నేరుగా నాకు తెలియజేయకుండా ఎవరి ద్వారానో నాకు తెలిసేలా చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కూడా అటువంటి చేదు అనుభవమే ఎదురైందన్నారు. కానీ ఇండస్ట్రీలో ఇటువంటి చేదు అనుభవాలు అందరికీ ఎదురవుతుంటాయని, కనుక వాటిని భరించక తప్పదని గ్రహించిన తర్వాత అటువంటి విషయాలకు బాధ పడటం మానేశానని రకుల్ ప్రీత్ సింగ్‌ చెప్పారు. 


Related Post

సినిమా స‌మీక్ష