హేమకి మళ్ళీ కేసు కష్టాలు షురూ!

September 12, 2024


img

టాలీవుడ్‌ నటి హేమకి మళ్ళీ కేసు కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో ఆమెతో సహా మొత్తం 88 మందిపై బెంగళూరు పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్‌ దాఖలు చేశారు. రేవ్ పార్టీలో నిషేదిత మాదక ద్రవ్యాలు తీసుకున్నవారిలో ఆమె కూడా ఒకరని దానిలో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిరోదక చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం వారిపై అభియోగాలు మోపారు.   

  ఈ ఏడాది మే 20వ తేదీన బెంగళూరు శివారులో ఓ పారిశ్రామికవేత్తకు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారు. రేవ్ పార్టీ సమాచారం అందుకొని బెంగళూరు క్రైమ్ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసి, అందరినీ అదుపులో తీసుకొని, వారి రక్తం, గోళ్ళు, జుట్టు నమూనాలు తీసుకొని కేసులు నమోదు చేశారు. 

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాటిని పరిశీలించి నివేదికలు తీసుకున్నారు. వాటిలో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో, ఆమె కొన్ని రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండాల్సి వచ్చింది. జూన్ 14వ తేదీన ఆమె బెయిల్‌ తీసుకొని బయట పడ్డారు. కానీ ఇప్పుడు పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్‌ దాఖలు చేసినందున మళ్ళీ ఆమెకు ఈ కేసులో కోర్టు చుట్టూ తిరుగక తప్పదు. 

హేమ పేరు ఈ కేసులో బయటపడగానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమెని సస్పెండ్ చేసింది. కానీ ఆ తర్వాత ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్‌లో హేమ పేరు చేర్చినందున మంచు విష్ణు ఏవిదంగా స్పందిస్తారో?


Related Post

సినిమా స‌మీక్ష