టాలీవుడ్‌కి ఓ కమీషన్‌ వేయండి ప్లీజ్!

September 06, 2024


img

సినీ పరిశ్రమలో మహిళా నటులు, మహిళా జూనియర్ ఆర్టిస్టులు, సిబ్బంది తరచూ లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ప్రముఖ నటీమణులే అప్పుడప్పుడు చెపుతుంటారు. అయితే ఎవరూ ఎవరిపై పోలీసులకు ఫిర్యాదు చేయరు. ఎందుకంటే లైంగికవేధింపులకు సాక్ష్యాలు చూపాలి. ఒకవేళ ఫిర్యాదు చేస్తే వారికి సినీ పరిశ్రమ తలుపులు మూసుకుపోతాయి. కనుక సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురవుతున్నవారు మౌనంగా వాటిని భరిస్తూనే ఉంటారు. 

ఇటీవల కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితి తెలుసుకునేందుకు హేమ కమిటీని నియమించగా అది పలువురు ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వారి పేర్లతో సహా ఓ నివేదిక సమర్పించింది. కేరళ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా ఆ నివేధికని బయట పెట్టడమే కాక వారిపై పోలీస్ కేసులు కూడా నమోదు చేయిస్తోంది. 

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకి కూడా అటువంటి కమీషన్‌ నియమించాలని కోరుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు  స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసుకోగల చక్కటి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా స్పందించవలసి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష