ప్రభాస్‌ విరాళం ఎంతంటే...

September 04, 2024


img

వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు తదితరులు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటించారు.

తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్‌ కూడా విరాళాలు ప్రకటించారు. ప్రభాస్‌ ఏపీ తెలంగాణలకు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటించగా, అల్లు అర్జున్‌ చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇప్పటివరకు విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖులలో ప్రభాస్‌ ఎక్కువ ఇచ్చారు.

తెలుగు సినీ ప్రముఖులు అందరూ విరాళాలు ప్రకటిస్తున్నప్పటికీ అక్కినేని నాగార్జున కుటుంబం ఇంకా ప్రకటించలేదు. తుమ్మిడిచెరువు వద్ద కోట్లు విలువ చేసే తమ ‘ఎన్ కన్వెన్షన్’ని హైడ్రా కూల్చివేసిందనే బాధ, కోపం వారిలో ఉండి ఉండవచ్చు. బహుశః అందుకే అక్కినేని కుటుంబం ఇంతవరకు విరాళం ప్రకటించలేదేమో? లేదా నేడో రేపో వారు కూడా మొక్కుబడిగా ఎంతో కొంత విరాళం ప్రకటించే అవకాశం ఉంది.

దర్శకుడు వెంకీ అట్లూరి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళాలు ఇచ్చారు. పెద్ద హీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌, కొరటాల శివ, వారి సినిమాలకు సంగీత దర్శకత్వం చేసే దేవిశ్రీ ప్రసాద్, తమన్, మిక్కీ జె మేయర్ తదితరులు కూడా ఇంతవరకు విరాళాలు ప్రకటించలేదు.

అలాగే తెలుగు సినిమాలలో హీరోయిన్లుగా చేస్తూ కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకునే హీరోయిన్లలో ఎవరూ విరాళాలు ప్రకటించలేదు. ఒక్క అనన్య నాగళ్ళ మాత్రం ఉడతా భక్తిగా రెండు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షలు విరాళం ప్రకటించారు. 


Related Post

సినిమా స‌మీక్ష