సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’తో కలిసి హుషారుగా బాజాలు మ్రోగించిన తర్వాత సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక’ అనే ఓ తికమక టైటిల్‌తో మరో సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కనుక నిర్మాత దిల్‌రాజు ట్రైలర్ వదిలారు.
ఎదుగూ బొదుగూ లేని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే సుహాస్ పెళ్ళి చేసుకున్నాక పిల్లలు పుడితే ఖర్చులు భరించలేమని వద్దనుకుంటాడు. ఓ పక్క ఇంట్లో తల్లీ తండ్రి, నానమ్మ మనుమల కోసం వెయిటింగ్.
కుర్రాడి సంగతి తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ కోడలితో కలిసి కుట్ర చేసి ఆమె కడుపు పండిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న పంట ఎలా పండిందో అనే అనుమానంతో కండోమ్ కంపెనీ మీద కోర్టులో కేసు. ఈ మద్యలో వెన్నెల కిషోర్ హడావుడి ఉండనే ఉంది. కనుక హాయిగా సాగే ఈ ఫ్యామిలీ డ్రామాతో సుహాస్ మరో హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఈ సినిమాలో సుహాస్‌కి జోడీగా సంగీర్తన నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: విజయ్ బల్గేనిన్; కెమెరా: సాయి శ్రీరామ్; ఎడిటింగ్; కోడాటి పవన్ కళ్యాణ్ చేశారు.
ఈ సినిమాని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హంసిత రెడ్డి నిర్మిస్తున్నారు.