హరిహర వీరమల్లు అప్‌డేట్‌

August 08, 2024


img

పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో తెలీని పరిస్థితి. పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ లభించక ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల పరిస్థితి కూడా ఆలాగే ఉంది. ఈ మూడు సినిమాల నిర్మాతలు పవన్‌ కళ్యాణ్‌ని కలిసి మిగిలిన షూటింగ్‌ పూర్తి చేయాలని ఇటీవలే విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపధ్యంలో హరిహర వీరమల్లు నుంచి చిన్న అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల టాలీవుడ్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ హరిహర వీరమల్లులో ఓ కీలకపాత్ర చేయబోతున్నారంటూ మెగాసూర్య ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో ఆయనకు ఆహ్వానం పలికింది.  

ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలుపెట్టారు. కానీ సినిమా షూటింగ్‌ నిలిచిపోవడంతో  మిగిలిన భాగాన్ని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నారు. అయితే క్రిష్ పర్యవేక్షణ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలియజేసింది. 

హరిహర వీరమల్లులో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఇంకా జాక్విలిన్ ఫెర్నాండస్, ఆదిత్య మీనన్, సునీల్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, నోరా ఫతేహీ, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తమకు సమయం కేటాయిస్తే ఈ ఏడాది చివరిలోగా హరిహర వీరమల్లు విడుదల చేస్తామని నిర్మాత చెపుతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష